Sorakaya Pachi Mirchi Pachadi : సొరకాయ పచ్చిమిర్చి పచ్చడి.. సొరకాయ, పచ్చిమిర్చి కలిపి చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో తినడానికి అలాగే ఇడ్లీ, దోశ, రోటి, చపాతీ వంటి వాటితో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది, అల్పాహారాలల్లోకి తరుచూ పల్లీ చట్నీలే కాకుండా ఇలా సొరకాయతో కూడా పచ్చడి తయారు చేసి తీసుకోవచ్చు. ఈ పచ్చడిని తయారు చేయడం చాలా సులభం. చాలా తక్కువ సమయంలో చాలా రుచిగా ఈ పచ్చడిని ఎవరైనా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ సొరకాయ పచ్చిమిర్చి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి.. ఇప్పుడు తెలుసుకుందాం.
సొరకాయ పచ్చిమిర్చి పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టీ స్పూన్స్, లేత సొరకాయ ముక్కలు – 3 కప్పులు, పచ్చిమిర్చి – 15, తరిగిన టమాటాలు – 2, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – గుప్పెడు, చింతపండు – ఒక టేబుల్ స్పూన్.
తాళింపుకు కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టీ స్పూన్స్, ఆవాలు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, ఇంగువ – చిటికెడు.
సొరకాయ పచ్చిమిర్చి పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక లేత సొరకాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి కలపాలి. తరువాత మూత పెట్టి 4 నిమిషాల పాటు వేయించిన తరువాత టమాట ముక్కలు, పసుపు, ఉప్పు వేసి కలపాలి. తరువాత మూత పెట్టి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు మగ్గించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కొత్తిమీర,చింతపండు వేసి కలిపి చల్లారనివ్వాలి. ఈ ముక్కలు చల్లారిన తరువాత వీటిని జార్ లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో తాళింపుకు నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. తాళింపు వేగిన తరువాత దీనిని పచ్చడిలో వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సొరకాయ పచ్చిమిర్చి పచ్చడి తయారవుతుంది. దీనిని అందరూ లొట్టలేసుకుంటూ ఎంతో ఇష్టంగా తింటారు. అన్నంతో తినడానికి, అల్పాహారాలతో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది.