Soya Nuggets : మీల్ మేకర్స్ ను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వీటితో కూరలు, పులావ, బిర్యానీ వంటి వాటినే కాకుండా వివిధ రకాల చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాము. మీల్ మేకర్స్ తో చేసుకోదగిన రుచికరమైన చిరుతిళ్లల్లో సోయా నగెట్స్ కూడా ఒకటి. వీటినే సోయా పకోడా అని కూడా అంటారు. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. 20 నిమిషాల్లోనే చాలా సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు. క్రిస్పీగా, రుచిగా ఉండే ఈ సోయా నగెట్స్ ను అందరూ ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. మీల్ మేకర్స్ తో ఎంతో రుచిగా ఉండే ఈ సోయా నగెట్స్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సోయా నగెట్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పెద్దగా ఉండే మీల్ మేకర్ – ఒక కప్పు, పెరుగు – 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, బియ్యంపిండి – 2 టీ స్పూన్స్, శనగపిండి – 3 టీ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
సోయా నగెట్స్ తయారీ విధానం..
ముందుగా మీల్ మేకర్స్ ను వేడి నీటిలో వేసి 10 నిమిషాల పాటు నానబెట్టాలి. తరువాత వీటిలో ఉండే నీటిని పిండేసి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, ఉప్పు, గరం మసాలా, కొత్తిమీర వేసి కలపాలి. తరువాత వీటిని 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత ఇందులో శనగపిండి, బియ్యంపిండి వేసి కలపాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మీల్ మేకర్స్ ను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని వేయించిన తరువాత మిగిలిన నూనెలో కరివేపాకు, తరిగిన పచ్చిమిర్చి వేసి వేయించి మీల్ మేకర్ లపై వేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సోయా నగెట్స్ తయారవుతాయి. ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా ఇంట్లో అందరూ వీటిని తినేస్తారు.