మన ఇంట్లో ఉండే వివిధ రకాల కీటకాల్లో బొద్దింకలు కూడా ఒకటి. చాలా మందికి వీటిని చూడగానే అసహ్యం, కోపం,చిరాకు, భయం కలుగుతుంది. బొద్దింక కనిపించిన వెంటనే దానిని ఇంట్లో నుంది ప్రాలదోలడమో, చంపయేడమో చేస్తూ ఉంటారు. ఎందుకంటే బొద్దింకల ద్వారా ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇవి వాటి ద్వారా అనేక రకాల వైరస్ లను, బ్యాక్టీరియాలను వ్యాపింపజేసి తీవ్ర అనారోగ్యానికి దారి తీస్తాయి. కనుకమన ఇంట్లో మన ఇంటి పరిసరాల్లో బొద్దింకలు లేకుండా చూసుకోవాలి. మనకు మార్కెట్ లో బొద్దింకలను నివారించే అనేక రకాల స్ప్రేలు లభిస్తాయి. వీటిని రసాయనాలను ఎక్కువగా వాడతారు. వీటిని వాడడం వల్ల బొద్దింకల సమస్య నుండి మనం చాలా సులభంగా బయటపడవచ్చు. కానీ వీటిని వాడడం వల్ల మనం వివిధ రకాల దుష్ప్రభావాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ముఖ్యంగా చిన్న పిల్లలు, పెంపుడు జంతువులు ఉన్న వారు ఈ స్ప్రేలను వాడే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అయితే ఇలా రసాయనాలు కలిగిన స్ప్రేలను వాడడానికి బదులుగా కొన్ని సహజ చిట్కాలను వాడడం వల్ల కూడా మనం బొద్దింకల సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. బొద్దింకలను నివారించే సహజ మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బొద్దింకలను నివారించడంలో బిర్యానీ ఆకులు మనకు ఎంతో సహాయపడతాయి. బొద్దింకలు తిరిగే చోట ఈ ఆకులను ఉంచడం వల్ల బొద్దింకలు పారిపోతాయి. అలాగే కీరదోసల నుండి వచ్చే వాసన కూడా బొద్దికలకు నచ్చదు. బొద్దింకలు తిరిగే చోట కీరదోస ముక్కలను, వాటి తొక్కను ఉంచడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
ఇక నీటిలో వెనిగర్ ను కలిపి బొద్దింకలు తిరిగే చోట చల్లాలి. ఇలా చేయడం వల్ల వెనిగర్ నుండి వచ్చే వాసన కారణంగా బొద్దింకలు పారిపోతాయి. బొద్దింకలు తిరిగే చోట పొట్టు వలిచి కొద్దిగా దంచిన వెల్లుల్లి రెబ్బలను ఉంచడం వల్ల కూడా బొద్దింకల సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే బొద్దింకలు తిరిగే చోట నిమ్మరసాన్ని స్ప్రే చేయడం, నిమ్మతొక్కలను ఉంచడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఒక గిన్నెలో బేకింగ్ సోడా, పంచదార కలిపి బొద్దింకలు తిరిగే చోట స్ప్రే చేయాలి. ఇలా చేయడం వల్ల బొద్దింకలు నశిస్తాయి.
బొద్దింకలను నశింపజేయడంలో ఈ చిట్కా సమర్థవంతంగా పని చేస్తుంది. ఈ చిట్కా తయారీలో బేకింగ్ సోడాకు బదులుగా కార్న్ ఫ్లోర్ ను కూడా వాడవచ్చు. ఇక పుదీనా, లావెండర్, టీ ట్రీ ఆయిల్ వంటి నూనెలను నీటిలో కలిపి బొద్దింకలు తిరిగే చోట స్ప్రే చేయాలి. ఇలా చేయడం వల్ల బొద్దింకలు నివారించబడతాయి. అలాగే దాల్చిన చెక్కనుండి వచ్చే ఘాటైన వాసన కూడా బొద్దింకలను నచ్చదు. దాల్చిన చెక్కను పొడిగా చేసి బొద్దింకలు తిరిగే చోట చల్లడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా సహజ మార్గాలను ఉపయోగించి కూడా బొద్దింకల సమస్య నుండి మనం చాలా సులభంగా బయటపడవచ్చు.