Special Egg Dum Biryani : మనం కోడిగుడ్లతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఎగ్ దమ్ బిర్యానీ కూడా ఒకటి. ఎగ్ దమ్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. ఇది మనకు ఎక్కువగా రెస్టారెంట్ లలో లభిస్తుంది. ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. రెస్టారెంట్ లలో లభించే ఈ ఎగ్ దమ్ బిర్యానీని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా ఇంట్లోనే ఎగ్ దమ్ బిర్యానీని తయారు చేసుకుని తినవచ్చు. రుచిగా, అందరికి నచ్చేలా అలాగే చాలా సులభంగా ఎగ్ దమ్ బిర్యానీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్ దమ్ బిర్యానీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చిమిర్చి – 5, టమాట – పెద్దది ఒకటి, పెరుగు – 1/3 కప్పు, కారం – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఉడికించిన కోడిగుడ్లు – 5, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 3, యాలకులు – 3, బిర్యానీ ఆకు – 1, సాజీరా – అర టీస్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒకటిన్నర టీ స్పూన్, బ్రౌన్ ఆనియన్స్ – పావు కప్పు, తరిగిన కొత్తిమీర – ఒక టేబుల్ స్పూన్, పుదీనా – ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – 100 ఎమ్ ఎల్.
మసాలా పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 4, యాలకులు – 4, అనాస పువ్వు – 1, జాపత్రి – 1, మిరియాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, గసగసాలు -ఒక టీ స్పూన్, జీడిపప్పు – 6, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్.
అన్నం తయారీకి కావల్సిన పదార్థాలు..
నీళ్లు – 2 లీటర్లు, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 3, యాలకులు – 3, బిర్యానీఆకు – 1, సాజీరా – అర టీ స్పూన్, అనాస పువ్వు – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, పుదీనా – 2 టేబుల్ స్పూన్స్, గంటపాటు నానబెట్టిన బాస్మతీ బియ్యం – అరకిలో.
ఎగ్ దమ్ బిర్యానీ తయారీ విధానం..
ముందుగా మసాలా పొడి కోసం జార్ లో మసాలా పదార్థాలన్నింటిని వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే జార్ లో టమాట ముక్కలు, పచ్చిమిర్చి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో పెరుగు, ఉప్పు, కారం, పసుపు వేసి ఉండలు లేకుండా అంతా కలిసేలా కలుపుకోవాలి. తరువాత అన్నం తయారీకి ఒక గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులో బియ్యం తప్ప మిగిలిన పదార్థాలు వేసి నీటిని మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత బియ్యం వేసి కలపాలి. ఈ బియ్యాన్ని 90 శాతం ఉడికించాలి. బియ్యం ఉడుకుతుండగానే అడుగు మందంగా ఉండే కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత కొద్దిగా ఉప్పు, కారం, పసుపు వేసి కలపాలి. తరువాత కోడిగుడ్లు వేసి కలపాలి. వీటిని ఎర్రగా అయ్యే వరకు వేయించిన ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో మరో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి.
తరువాత మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత టమాట పేస్ట్, పెరుగు వేసి కలపాలి. వీటిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసి కలపాలి. తరువాత వేయించిన గుడ్లు వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. దీనిని మూత పెట్టి చిన్న మంటపై నూనె పైకి తేలే వరకు ఉడికించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రేవి నుండి సగం గ్రేవిని అలాగే రెండు లేదా మూడు గుడ్లను ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. కళాయిలో మిగిలిన గ్రేవిపై కొద్దిగా కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ ను చల్లుకోవాలి. తరువాత అన్నాన్ని వడకట్టి కళాయిలో వేసుకుని పైన సమానంగా చేసుకోవాలి. తరువాత దీనిపై పక్కకు తీసిన గ్రేవిని, గుడ్లను వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ ను, నెయ్యిని వేసుకోవాలి.
కలర్ ఫుల్ గా ఉండడానికి ఫుడ్ కలర్ లేదా కుంకుమ పువ్వు నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు దీనిపై బటర్ పేపర్ ను ఉంచి మూత పెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనాని ఉంచి దానిపై ఈ కళాయిని ఉంచి 5 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై ఉడికించాలి. తరువాత మంటను చిన్నగా చేసి మరో 10 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని మరో 10 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ దమ్ బిర్యానీ తయారవుతుంది. దీనిని రైతాతో, మిర్చి కా సాలన్ తో తింటే చాలారుచిగా ఉంటుంది. ఈ ఎగ్ దమ్ బిర్యానీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.