Spicy Aloo Fry : బంగాళాదుంపలతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంపలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. మనం ఎక్కువగా బంగాళాదుంపలతో వేపుడును తయారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంపలతో చేసే ఈ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ బంగాళాదుంప ఫ్రైను మరింత రుచిగా, స్పైసీగా కూడా తయారు చేసుకోవచ్చు. గుంటూరు స్టైల్ లో చేసే ఈ స్పైసీ బంగాళాదుంప వేపుడు రుచిగా ఉండడంతో పాటు దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. ఎంతో రుచిగా, కారంగా బంగాళాదుంప ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
స్పైసీ బంగాళాదుంప ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన బంగాళాదుంపలు – పావుకిలో, పొడుగ్గా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, ఎండుమిర్చి – 10, గరం మసాలా – ఒక టీ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 8, జీలకర్ర – ఒక టీ స్పూన్, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ఆలూ ఫ్రై తయారీ విధానం..
ముందుగా జార్ లో ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ లా చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత పసుపు, ఉప్పు, మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్, గరం మసాలా వేసి వేయించాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత బంగాళాదుంప ముక్కలు వేసి కలపాలి.
తరువాత దీనిపై మూత పెట్టి మధ్యస్థ మంటపై 5 నిమిషాల పాటు వేయించాలి. తరువాత కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే స్పైసీ బంగాళాదుంప ఫ్రై తయారవుతుంది. దీనిని చపాతీ, రోటీ, పుల్కా, దోశ, అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే బంగాళాదుంప ఫ్రై కంటే ఈ విధంగా తయారు చేసిన బంగాళాదుంప ఫ్రై మరింత రుచిగా ఉంటుంది.