Spicy Egg Pulusu : కోడిగుడ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. వీటితో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. కోడిగుడ్లతో చేసే రుచికరమైన వంటకాల్లో ఎగ్ పులుసు కూడా ఒకటి. ఎగ్ పులుసు చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే తరచూ ఒకే స్టైల్ లో కాకుండా ఈ ఎగ్ పులుసును మనం మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా చేసే ఈ ఎగ్ పులుసు కారంగా, చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. మరింత రుచిగా, స్పైసీగా ఎగ్ పులుసును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
స్పైసీ ఎగ్ పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన కోడిగుడ్లు – 4, టమాటాలు – 2, అల్లం – చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 10, దాల్చిన చెక్క – ఒక చిన్న ముక్క, లవంగాలు – 2, యాలకులు – 2, నానబెట్టిన చింతపండు – చిన్న నిమ్మకాయంత, నూనె – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – ఒక కప్పు, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – 2 టీ స్పూన్స్, ధనియాల పొడి – అర టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, నీళ్లు – అర కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
స్పైసీ ఎగ్ పులుసు తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో టమాట ముక్కలు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత కోడిగుడ్లు వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి. తరువాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి. తరువాత చింతపండు రసం, నీళ్లు పోసి కలపాలి. నీళ్లు మరిగిన తరువాత గుడ్లు వేసి కలపాలి. తరువాత మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించి కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ పులుసు తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది.