Spicy Prawns Roast : మన ఆరోగ్యానికి రొయ్యలు ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వీటితో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. రొయ్యలతో చేసుకోదగిన వంటకాల్లో స్పైసీ ప్రాన్స్ రోస్ట్ కూడా ఒకటి. ఈ వంటకం కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది. బ్యాచిలర్స్, వంటరాని వారు కూడా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే స్పైసీ ప్రాన్స్ రోస్ట్ తయారీ విధానాన్ని అలాగే తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
స్పైసీ ప్రాన్స్ రోస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 3 టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 4, కరివేపాకు – రెండు రెమ్మలు, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు – 2, ఉప్పు – తగినంత, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 6.
మ్యారినేషన్ కు కావల్సిన పదార్థాలు..
శుభ్రం చేసిన రొయ్యలు – 300 గ్రా., పసుపు – అర టీ స్పూన్, మిరియాల పొడి – ఒక టీ స్పూన్, కాశ్మీరీ చిల్లీ పౌడర్ – ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, నిమ్మరసం – ఒక టేబుల్ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్.
స్పైసీ ప్రాన్స్ రోస్ట్ తయారీ విధానం..
ముందుగా రొయ్యలను శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అందులో మ్యారినేషన్ కు కావల్సిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తరువాత వీటిపై మూత పెట్టి అర గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత కళాయిని తీసుకుని స్టవ్ మీద ఉంచి వేడి చేయాలి. కళాయి వేడయ్యాక అందులో మ్యారినేట్ చేసుకున్న రొయ్యలను వేసి కలపాలి. తరువాత వీటిపై మూత పెట్టి 3 నిమిషాల పాటు వేయించాలి. తరువాత మూత తీసి ఈ రొయ్యలను కలపాలి. తరువాత వీటిపై మూత పెట్టి మరో 3 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
మరో కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి కూడా వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తరువాత వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తరువాత ముందుగా వేయించిన రొయ్యలను వేసి కలపాలి. ఈ రొయ్యలను నూనె పైకి తేలే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే స్పైసీ ప్రాన్స్ రోస్ట్ తయారవుతుంది. దీనిని పప్పు, సాంబార్ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.