Spring Dosa : స్ప్రింగ్ దోశ.. మనం చేసుకోదగిన రుచికరమైన, సులభమైన దోశలల్లో ఇది కూడా ఒకటి. స్ప్రింగ్ దోశ చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు దీనిని మరింత ఇష్టంగా తింటారు. ఇంట్లో దోశ పిండి ఉంటే 5 నిమిషాల్లో దీనిని తయారు చేసుకోవచ్చు. తరుచూ ఒకేరకం దోశలు కాకుండా ఇలా వెరైటీగా కూడా దోశలను తయారు చేసి తీసుకోవచ్చు. అందరికి ఎంతగానో నచ్చే ఈ స్ప్రింగ్ దోశలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
స్ప్రింగ్ దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, క్యారెట్ తురుము – అర కప్పు, క్యాబేజి తురుము – అర కప్పు, క్యాప్సికం తరుగు – పావు కప్పు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1 లేదా 2, ఉప్పు – తగినంత, పనీర్ తురుము – అర కప్పు, టమాట సాస్ – ఒక టీ స్పూన్, షెజ్వాన్ చట్నీ – ఒక టీ స్పూన్.
స్ప్రింగ్ దోశ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత క్యారెట్, క్యాబేజి, క్యాప్సికం తురుము, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇందులోనే ఉప్పు కూడా వేసి పచ్చి వాసన పోయ వరకు వేయించాలి. తరువాత పనీర్ తురుము వేసి మరో నిమిషం పాటు వేయించాలి. తరువాత టమాటకిచప్ వేసి కలపాలి. దీనిని మరో నిమిషం వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత స్టవ్ మీద దోశ పెనాని ఉంచి వేడి చేయాలి. దోశ పెనం వేడయ్యాక పిండిని తీసుకుని దోశ లాగా వేసుకోవాలి.దోశ తడి ఆరిన తరువాత నూనె వేసుకోవాలి.
తరువాత షెజ్వాన్ చట్నీ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. తరువాత ముందుగా తయారు చేసుకున్న క్యారెట్ మిశ్రమాన్ని దోశ ఒక చివరనా ఉంచాలి. దోశ ఎర్రగా కాలిన తరువాత దోశను స్ప్రింగ్ లాగా రోల్ చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే స్ప్రింగ్ దోశ తయారవుతుంది. ఈ విధంగా తయారు చేసిన స్ప్రింగ్ దోశను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.