Srirangam Vada : కొన్ని రకాల వంటకాలు అవి తయారు చేసే ప్రాంతం పేరు మీదుగా ప్రసిద్ది చెందుతాయి. అలాంటి వాటిలో తమిళనాడులోని శ్రీరంగం పట్టణంలో లభించే శ్రీరంగం వడలు కూడా ఒకటి. పొట్టు మినపప్పుతో చేసే ఈ వడలు చాలా రుచిగా ఉంటాయి. ఇవి కొద్దిగా తరుచూ చేసే వడలకు భిన్నంగా ఉంటాయి. ఈ శ్రీరంగం వడలను తయారు చేయడం కూడా చాలా సులభం. ఎంతో కమ్మగా, క్రిస్పీగా ఉండే ఈ శ్రీరంగం వడలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీరంగం వడ తయారీకి కావల్సిన పదార్థాలు..
పొట్టు మినపప్పు – ఒక కప్పు, మిరియాలు -ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, బియ్యం పిండి – ఒక టేబుల్ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
శ్రీరంగం వడ తయారీ విధానం..
ముందుగా పప్పును శుభ్రంగా కడిగి 4 గంటల పాటు నానబెట్టాలి. తరువాత పైన పేరుకుపోయిన పొట్టును తీసేసి నీరంతా పోయేలా పప్పును వడకట్టాలి. తరువాత ఈ పప్పును గ్రైండర్ లో వేసి మెత్తగా రుబ్బుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత రోట్లో మిరియాలు వేసి బరకగా దంచుకుని పిండిలో వేసి కలపాలి. తరువాత ఉప్పు, బియ్యంపిండి వేసి కలపాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పిండిని ఎక్కువగా తీసుకుని ప్లాస్టిక్ కవర్ మీద వేసి చేతికి తడి చేసుకుంటూ పుల్కా అంత పరిమాణంలో వడలాగా వత్తుకోవాలి. తరువాత ఈ వడను నూనెలో వేసి వేయించాలి. దీనిని మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే శ్రీ రంగం వడలు తయారవుతాయి. అల్పాహారంగా లేదా పండగలకు నైవేధ్యంగా వీటిని తయారు చేసుకుని తినవచ్చు. ఈ వడలను కూడా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.