మద్యం ప్రియులు ఎప్పుడు సమావేశమైనా మధ్యలో మద్యం ఎంత పాతదైతే అంత రుచిగా ఉంటుందని, అంతేకాకుండా పాత మద్యం చాలా ఖరీదైనదిగా కూడా ఉంటుందని మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే, మద్యం సంవత్సరాల తరబడి నిల్వ చేసినా ఎందుకు పాడవదు? దాని ధర ఎందుకు పెరుగుతుంది? ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. మద్యానికి ఎక్స్‌పైరీ డేట్ లేదని చెప్పడం కరెక్ట్ కాదు. ఇది ఉపయోగిస్తున్న మద్యం రకంపై ఆధారపడి ఉంటుంది. ప్రధానంగా మద్యం రెండు రకాలుగా ఉంటుంది: అన్‌డిస్టిల్డ్ డ్రింక్స్ (Un-distilled drinks), డిస్టిల్డ్ డ్రింక్స్ (Distilled drinks). అన్‌డిస్టిల్డ్ డ్రింక్స్‌లో బీర్, వైన్, సైడర్ వంటివి ఉంటాయి. వీటికి ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. అయితే, డిస్టిల్డ్ డ్రింక్స్‌లో బ్రాందీ, వోడ్కా, టేకిలా, రమ్ వంటివి ఉంటాయి, వీటికి ఎటువంటి ఎక్స్‌పైరీ డేట్ ఉండదు. వీటిని చాలా కాలం పాటు ఉపయోగించవచ్చు.
పూర్వం ప్రజలు పెద్ద పెద్ద చెక్క పాత్రల్లో మద్యాన్ని నిల్వ చేసేవారని పెద్దలు చెబితే విని ఉంటారు. నేడు కూడా ప్రజలు మద్యాన్ని నిల్వ చేస్తారు. వాస్తవానికి, మద్యం లో ఉండే ఇథనాల్ శాతం బ్యాక్టీరియా లేదా ఇతర సూక్ష్మజీవులు వృద్ధి చెందకుండా నిరోధిస్తుంది. దీనివల్ల అది ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది. అంతేకాకుండా, ఇందులో నీటి శాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇది సూక్ష్మజీవుల అభివృద్ధికి అవసరం. మద్యాన్ని ఎక్కువ కాలం సురక్షితంగా ఉంచడానికి దానిని నిల్వ చేసే విధానం కూడా చాలా ముఖ్యం. మద్యాన్ని ఎల్లప్పుడూ చల్లని, చీకటి ప్రదేశంలో నిల్వ చేయాలి.
చాలా మంది మద్యం బాటిల్ తెరిచిన తర్వాత అది త్వరగా పాడైపోతుందని భావిస్తారు. అయితే, అది నిజం కాదు. నిపుణులు చెప్పేదాని ప్రకారం.. బాటిల్ తెరిచిన తర్వాత కూడా మద్యం పాడవదు.. కానీ దాని నాణ్యతలో మాత్రం తేడా వస్తుంది. కాబట్టి, మద్యం బాటిల్ తెరిచిన తర్వాత దానిని గరిష్టంగా ఒక సంవత్సరం లోపు పూర్తి చేయడం మంచిది.