Sweet Potato Puri Recipe : పూరీలు అంటే అందరికీ ఇష్టమే. వీటిని ఆలు కూరతో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటాయి. అలాగే చికెన్, మటన్ వంటి కూరలతోనూ పూరీలను తింటుంటారు. అయితే పూరీలను రొటీన్‌గా కాకుండా వెరైటీ రుచిలోనూ చేసుకోవచ్చు. వీటిని చిలగడదుంపలతోనూ చేయవచ్చు. ఇవి కూడా ఎంతో రుచిగా ఉంటాయి. చిలగడ దుంపలతో పూరీలను చేయడం చాలా సులభమే. వీటిని అందరూ ఇష్టంగా తింటారు. ఈ పూరీలను ఎలా తయారు చేయాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చిలగడదుంప పూరీల తయారీకి కావల్సిన పదార్థాలు..
చిలగడదుంపలు – పావు కిలో (ఉడికించి తొక్క తీసి బాగా మెదపాలి), బెల్లం తురుము – పావు కప్పు, గోధుమ పిండి – ఒక కప్పు, ఉప్పు – తగినంత, యాలకుల పొడి – ఒక టీస్పూన్, నీరు – పిండి కలపడానికి తగినంత.
చిలగడదుంప పూరీలను తయారుచేసే విధానం..
ఒక గిన్నెలో కొద్దిగా నీరు, బెల్లం తురుము వేసి గరిటెతో కలిపి కరిగించి వడకట్టాలి. ఇదే పాత్రలో మెత్తగా చేసిన చిలగడదుంప ముద్ద, యాలకుల పొడి, గోధుమ పిండి వేసి బాగా కలపాలి. తగినంత నీరు జత చేసి పూరీ పిండిలా కలిపి అరగంట పాటు పక్కన ఉంచాలి. పిండిని చిన్న ఉండలుగా చేసి పూరీలలా ఒత్తుకోవాలి. బాణలిలో తగినంత నూనె పోసి కాగాక.. ఒక్కో పూరీ వేసి వేయించి తీయాలి. తియ్య తియ్యని చిలగడ దుంప పూరీలు రెడీ అవుతాయి. వీటిని నేరుగా అలాగే తినవచ్చు. లేదా ఏదైనా కూరతో తినవచ్చు. అయితే తియ్యని రుచి వద్దనుకునేవారు బెల్లం తీసేస్తే చాలు.. చిలగడదుంప పూరీలను తినవచ్చు. వీటిని అందరూ ఇష్టపడతారు.