CPI Narayana : బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్ బాస్ షో మళ్లీ వచ్చింది. బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరిట శనివారం సాయంత్రం ఈ షో ప్రారంభమైంది. ఈ క్రమంలోనే మొత్తం 17 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ ఇంట్లోకి ఎంటర్ అయ్యారు. అయితే ఈ షోపై సీపీఐ పార్టీ నాయకుడు నారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అదొక బ్రోతల్ హౌస్ అని, రెడ్ లైట్ ఏరియా కన్నా దారుణమని అన్నారు. ఈ క్రమంలోనే నారాయణ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అయితే నారాయణ వ్యాఖ్యలపై ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి స్పందించారు. నారాయణను ఆమె తీవ్ర పదజాలంతో దూషించారు.
ఓ చానల్ నిర్వహించిన డిబేట్‌లో నారాయణపై తమన్నా సింహాద్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఐ నారాయణను చెప్పుతో కొట్టాలని అన్నారు. దీంతో ఆమె వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే చాలా మంది ఆమె వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఆమె తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ తమన్నా మాత్రం తన వ్యాఖ్యలను సమర్థించుకుంది. తాను సరిగ్గానే మాట్లాడానని పేర్కొంది. బిగ్ బాస్ షోకు అనుకూలంగా ఆమె కామెంట్స్ చేసింది. ఆ షో వల్లే తనకు గుర్తింపు వచ్చిందని.. ఆమె సమర్థించుకుంది.
అయితే ఆది నుంచి బిగ్ బాస్ షోపై ఎవరో ఒకరు ఇలా కామెంట్లు చేస్తూనే వస్తున్నారు. సీపీఐ నారాయణ కూడా గతంలోనూ ఈ షోపై విమర్శలు చేశారు. ఇటీవల ముగిసిన సీజన్ 5 లో హద్దులు మీరిన రొమాన్స్‌తో షో అభాసుపాలైంది. అందులో సిరి, షణ్ముఖ్‌ల లవ్ ట్రాక్, ముద్దులు, హగ్గులకు ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ సారి ఓటీటీ షోలో ముమైత్ ఖాన్, శ్రీరాపాక వంటి గ్లామర్ భామలు ఉన్నారు. దీంతో బిగ్ బాస్ ఇంట్లో వీరు ఎంత రచ్చ చేస్తారోనని చర్చ నడుస్తోంది.