Tomato Pickle : వేసవి కాలం రాగానే మనలో చాలా మందికి సంవత్సరానికి సరిపడా వివిధ రకాల పచ్చళ్లను తయారు చేసి నిల్వ చేసుకునే అలవాటు ఉంటుంది. అందులో టమాట పచ్చడి ఒకటి. కానీ ప్రస్తుత తరుణంలో మనకు ఈ టమాట పచ్చడిని తయారు చేసి, నిల్వ చేసే అంత సమయం ఉండడం లేదు. కనుక అప్పటికప్పుడు తయారు చేసుకోవాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే ఎంతో రుచిగా ఉండే టమాట పచ్చడిని తయారు చేసే విధానాన్ని, తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
టమాటాలు – ఒక కేజీ, నూనె – పావు కప్పు, చింత పండు – 100 గ్రా., ఉప్పు – పావు కప్పు, కారం – అర కప్పు.
తాళింపుకు కావల్సిన పదార్థాలు..
నూనె – ఒకటిన్నర కప్పు, ఆవాలు – 2 టీ స్పూన్స్, మెంతులు- ఒక టీ స్పూన్, వెల్లుల్లి – ఒక వెల్లిపాయ మొత్తం, శనగ పప్పు – 2 టీ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఎండు మిర్చి – 4, కరివేపాకు – రెండు రెబ్బలు, ఇంగువ – సగం టీ స్పూన్.
టమాట పచ్చడి తయారీ విధానం..
ముందుగా టమాటాలను శుభ్రంగా కడిగి తడి లేకుండా చేసుకోవాలి. వీటిని మరీ చిన్నగా కాకుండా కొద్దిగా పెద్ద పరిమాణంలో కట్ చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి, కాగాక టమాట ముక్కలు, చింత పండు వేసి కలిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తరువాత ఉప్పు వేసి టమాటలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన టమాటలు చల్లారిన తరువాత కారం వేసి బాగా కలుపుకోవాలి.
తాళింపు తయారు చేసే విధానం..
ముందుగా ఆవాలు, మెంతులు, జీలకర్రను కొద్దిగా వేయించి జార్ లో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి కాగాక మిగిలిన పదార్థాలు వేసి వేయించాలి. తరువాత ముందుగా చేసి పెట్టుకున్న పొడిని వేసి బాగా కలిపి వెంటనే స్టప్ ఆఫ్ చేయాలి. ఈ తాళింపు చల్లారిన తరువాత ముందుగా చేసి పెట్టుకున్న టమాట మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల అప్పటికప్పుడు ఎంతో రుచిగా ఉండే టమాట పచ్చడి తయారవుతుంది. వేడి వేడి అన్నంలో ఈ టమాట పచ్చడి, నెయ్యి వేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది.