Tawa Pulao : మనకు స్ట్రీట్ ఫుడ్ లో ఎక్కువగా లభించే వాటిల్లో తవా పులావ్ కూడా ఒకటి. తవా పులావ్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. వంట చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు, నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈ తవా పులావ్ ను తయారు చేసి తీసుకోవచ్చు. అలాగే అన్నం ఎక్కువగా మిగిలినప్పుడు, ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈ తవా పులావ్ ను తయారు చేసి తీసుకోవచ్చు. లంచ్ బాక్స్ లోకి కూడా దీనిని తయారు చేసుకోవచ్చు. స్ట్రీట్ స్టైల్ తవా పులావ్ ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తవా పులావ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, బటర్ – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, సన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, చిన్నగా తరిగిన టమాటాలు – 2, పచ్చి బఠాణీ – 1/3 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, పావ్ భాజీ మసాలా – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, బాస్మతీ బియ్యం – 200 గ్రా., నిమ్మరసం – అర చెక్క, కొత్తిమీర – కొద్దిగా.
తవా పులావ్ తయారీ విధానం..
ముందుగా బాస్మతీ బియ్యంతో పొడి పొడిగా అన్నాన్ని వండుకోవాలి. తరువాత కళాయిలో నూనె, బటర్ వేసి వేడి చేయాలి. తరువాత జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.ఇవి వేగిన తరువాత టమాట ముక్కలు, బఠాణీ వేసి వేయించాలి. టమాట ముక్కలు మెత్తబడిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. దీనిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత ఉప్పు, కారం, పసుపుతో పాటు మిగిలిన పొడులు వేసి కలపాలి. ఇందులో కొద్దిగా నీళ్లు పోసి మసాలాలు మాడిపోకుండా నూనె పైకి తేలే వరకు వేయించాలి. తరువాత అన్నం వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత మరో టేబుల్ స్పూన్ బటర్, కొత్తిమీర వేసి పెద్ద మంటపై అంతా కలిసేలా కలుపుకోవాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే తవా పులావ్ తయారవుతుంది. దీనిని ఇలాగే తిన్నా లేదా రైతాతో తిన్నా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన తవా పులావ్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.