Menthikura Pachadi : మెతికూరను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. మెంతికూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మెంతికూరను ఎక్కువగా ఇతర వంటకాల్లో వాడుతూ ఉంటారు. అలాగేవివిధ రకాల కూరలను తయారు చేస్తూ ఉంటారు. మెంతికూరతో కూరలే కాకుండా మనం పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. మెంతికూర పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఏ కూర లేకపోయినప్పటికి ఈ పచ్చడితో కడుపు నిండా భోజనం చేయవచ్చు. మెంతికూరను ఇష్టపడని వారు కూడా ఈ పచ్చడిని ఇష్టంగా తింటారు. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మెంతికూరతో పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మెంతికూర పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, శనగపప్పు – ఒక టేబుల్ స్పూన్, మినపప్పు – ఒక టేబుల్ స్పూన్, ధనియాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 5, పచ్చిమిర్చి – 6, కరివేపాకు – ఒక రెమ్మ, శుభ్రం చేసిన మెంతిఆకులు – 2 కప్పులు, చింతపండు – చిన్న నిమ్మకాయంత, వెల్లుల్లి రెబ్బలు – 8, ఉప్పు – తగినంత.
మెంతికూర పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక శనగపప్పు, మినపప్పు, ధనియాలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఇవన్నీ వేగిన తరువాత ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత అదే కళాయిలో మెంతి ఆకులు, చింతపండు వేసి కలపాలి. మెంతిఆకులు పూర్తిగా మగ్గిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు జార్ లోముందుగా వేయించిన దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత వేయించిన మెంతిఆకు వేసి మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. అవసరమైతే ఒకటి లేదా రెండు టీ స్పూన్ల నీటిని వేసుకుని పచ్చడిని మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత తాళింపు చేసి పచ్చడిలో వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మెంతికూర పచ్చడి తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన పచ్చడిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.