Shampoo With Soap Nuts : తలస్నానం చేయడానికి, జుట్టును శుభ్రం చేసుకోవడానికి మనం అనేక రకాల షాంపులను వాడుతూ ఉంటాము. మార్కెట్ లో మనకు అనేక రకాల షాంపులు, వాసన వచ్చే షాంపులు అనేకం లభిస్తూ ఉంటాయి. షాంపులతో మనం సులభంగా చాలా తక్కువ సమయంలో తలస్నానం చేయవచ్చు. అయితే ఇలా షాంపులతో తలస్నానం చేయడం వల్ల మన జుట్టుకు మేలు కలుగుతుందని మనలో చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ షాంపులను వాడడం వల్ల నురుగు త్వరగా వస్తుంది. తలలో మురికి తొలగనప్పటికి నురుగు వస్తుంది. షాంపులను వాడడం వల్ల తలలో ఉండే బ్యాక్టీరియా ఏ మాత్రం నశించదు. అలాగే జుట్టు విరిగిపోవడం, పొడిబారడం, చిట్లడం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి.
షాంపులను వాడడం తేలికగా ఉన్నప్పటికి వీటిని వాడడం వల్ల ఎటువంటి మేలు కలగదని అలాగే మనం అనేక రకాల దుష్ప్రభావాలను ఎదుర్కొవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. జుట్టును శుభ్రం చేసుకోవడానికి షాంపులకు బదులుగా కుంకుడకాయలను వాడడమే మంచిదని వారు చెబుతున్నారు. కుంకుడు కాయలను వాడడం వల్ల జుట్టు మురికి పూర్తిగా తొలగిపోతుంది. అలాగే తలలో ఉండే బ్యాక్టీరియా, వైరస్, క్రిములు నశిస్తాయి. అంతేకాకుండా తలలో పేల సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. చుండ్రు సమస్య తగ్గుతుంది. కుంకుడుకాయలను వాడడం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయి. జుట్టు సంబంధిత సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే కుంకుడుకాయలను వాడడం చాలా మంది ఇబ్బందిగా భావిస్తూ ఉంటారు.
కుంకుడుకాయల రసం కళ్లల్లో పడి కళ్లు మండుతాయని, కుంకుడుకాయ తొక్కు జుట్టులో ఇరుక్కుపోయి జుట్టు చిక్కుళ్లు తీయడం కష్టమవుతుందని అలాగే సమయం ఎక్కువగా పడుతుందని భావిస్తూ ఉంటారు. ఇలాంటి వారు కుంకుడుకాయల పొడి వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కుంకుడుకాయలను వాటి లోపల ఉండే గింజలను పగలకొట్టాలి. తరువాత గింజలపై ఉండే నల్లటి పొట్టును తీసేసి కుంకుడుకాయలను గింజల లోపల ఉండే పప్పును ఎండలో పెట్టాలి. తరువాత వీటిని జార్ లో వేసి మెత్తని పొడిగా చేసుకుని జల్లించుకోవాలి. ఇలా తయారు చేసుకున్న కుంకుడుకాయ పొడిని నిల్వ చేసుకోవాలి.
ఈ పొడిని తలస్నానం చేసే ముందు వేడి నీటిలో వేసి నానబెట్టి ఆ నీటితో తలస్నానం చేయవచ్చు. లేదంటే ఈ పొడిని నేరుగా జుట్టుపై వేసుకుని తలస్నానం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల కుంకుడుకాయలతో కూడా చాలా సులభంగా తలస్నానం చేయవచ్చు. షాంపులకు బదులుగా కుంకుడుకాయలతో ఈ విధంగా తలస్నానం చేయడం వల్ల జుట్టుకు ఎంతో మేలు కలుగుతుందని ప్రయాణాల్లో లేదా సమయం తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే షాంపులతో తలస్నానం చేయాలని షాంపులను వాడడం వీలైనంత వరకు తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు.