Telangana Special Bagara Rice : తెలంగాణ స్పెష‌ల్ బ‌గారా రైస్‌.. చికెన్‌, మ‌ట‌న్‌లోకి అద్భుతంగా ఉంటుంది..

Telangana Special Bagara Rice : మ‌నం అప్పుడ‌ప్పుడు స్పెషల్ గా ఉండాల‌ని బ‌గారా అన్నాన్ని త‌యారు చేస్తూ ఉంటాం. బ‌గారా అన్నం చాలా రుచిగా ఉంటుంది. నాన్ వెజ్ వంట‌కాల‌తో పాటు మ‌సాలా కూర‌ల‌ను ఈ బ‌గారా అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. త‌ర‌చూ చేసే బ‌గారా అన్నానికి బ‌దులుగా ప‌చ్చి మ‌సాలాల‌ను వేసి చేసే బ‌గారా అన్నం మ‌రింత రుచిగా ఉంటుంది. సుల‌భంగా, రుచిగా ఉండేలా తెలంగాణా స్టైల్ లో ఈ బ‌గారా అన్నాన్ని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

తెలంగాణా స్టైల్ బ‌గారా అన్నం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బాస్మతి బియ్యం – ఒక‌టిన్న‌ర గ్లాస్, నూనె – 3 టేబుల్ స్పూన్స్, సాజీరా – ఒక టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 4, యాల‌కులు – 2, బిర్యానీ ఆకు – 1, జాప‌త్రి – 1, త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు – ఒక కప్పు, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, నీళ్లు – రెండున్న‌ర గ్లాసులు, ఉప్పు – త‌గినంత‌, కొత్తిమీర – కొద్దిగా, పుదీనా – కొద్దిగా, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్.

Telangana Special Bagara Rice perfect way of cooking
Telangana Special Bagara Rice

మ‌సాలా పేస్ట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 3, యాల‌కులు – 2, అనాస పువ్వు – 1, మిరియాలు – అర టీ స్పూన్, ధ‌నియాలు – 2 టీ స్పూన్స్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, చిన్న బిర్యానీ ఆకు – 1, గ‌స‌గ‌సాలు – ఒక టీ స్పూన్, జీడిప‌ప్పు – ఒక టేబుల్ స్పూన్, ఎండుకొబ్బ‌రి ముక్క‌లు – 2 టేబుల్ స్పూన్స్, అల్లం – 2 ఇంచుల మొక్క‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 10, ట‌మాట – 1.

తెలంగాణా స్టైల్ బ‌గారా అన్నం త‌యారీ విధానం..

ముందుగా బాస్మ‌తి బియ్యాన్ని శుభ్రంగా క‌డిగి త‌గిన‌న్ని నీళ్లు పోసి నానబెట్టాలి. త‌రువాత ఒక జార్ లో అల్లం, వెల్లుల్లి, ట‌మాట త‌ప్ప మ‌సాలా పేస్ట్ కు కావ‌ల్సిన మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత అందులోనే అల్లం, వెల్లుల్లి రెబ్బ‌లు, ట‌మాటాను ముక్క‌లుగా చేసి వేసుకుని అవ‌స‌ర‌మైతే కొద్దిగా నీటిని పోసి మెత్త‌గా పేస్ట్ గా చేసుకోవాలి. త‌రువాత ఒక క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత ముందుగా మిక్సీ ప‌ట్టుకున్న మ‌సాలా పేస్ట్ ను వేసి నూనె పైకి తేలే వ‌ర‌కు బాగా వేయించాలి.

త‌రువాత అందులో నీటిని పోసి మ‌రిగించాలి. ఇందులోనే ఉప్పును కూడా వేయాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత నాన‌బెట్టుకున్న బాస్మ‌తీ బియ్యాన్ని వేయాలి. ఇందులో కొత్తిమీర‌, పుదీనా, నెయ్యి వేసి క‌లపాలి. త‌రువాత దీనిపై మూత‌ను ఉంచి 20 నిమిషాల పాటు చిన్న మంట‌పై ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బ‌గారా అన్నం త‌యార‌వుతుంది. దీనిని మ‌సాలా కూర‌ల‌తో, పెరుగు చ‌ట్నీతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. త‌ర‌చూ చేసే బ‌గారా అన్నానికి బ‌దులుగా ఈ విధంగా చేసిన బ‌గారా అన్నం మ‌రింత రుచిగా ఉంటుంది.

D

Recent Posts