Thotakura Pappu : మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో తోటకూర ఒకటి. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. బరువు తగ్గడంలో, కంటి చూపును మెరుగుపరచడంలో, గుండె సంబంధిత సమస్యలు రాకుండా చేయడంలో, రక్తహీనత సమస్యను తగ్గించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, ఎముకలను ధృడంగా ఉంచడంలో ఇలా అనేక రకాలుగా తోటకూర మనకు ఉపయోగపడుతుంది. సరిగ్గా వండాలే కానీ దీనికి వచ్చిన రుచి మరే ఇతర ఆకుకూరకు రాదు. ఈ తోటకూరతో మనం ఎంతో రుచిగా ఉండే పప్పును కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పప్పు రుచిగా ఉండడంతో పాటు తయారు చేయడం కూడా చాలా తేలిక. ఆరోగ్యానికి మేలు చేసే తోటకూరతో పప్పును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తోటకూర పప్పు తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన తోటకూర – 5 కట్టలు ( చిన్నవి), కందిపప్పు – 150 గ్రా., తరిగిన టమాటాలు – 3, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, నానబెట్టిన చింతపండు – చిన్న నిమ్మకాయంత, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 1, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, కారం – ఒక టేబుల్ స్పూన్, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, పసుపు – అర టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఇంగువ – పావు టీ స్పూన్.
తోటకూర పప్పు తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో కందపప్పును తీసుకుని శుభ్రంగా కడగాలి.తరువాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, తోటకూర, టమాట ముక్కలు, ఒక గ్లాస్ నీటిని పోసుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే ఉడికించుకోవాలి. తరువాత మూత తీసి పప్పును మెత్తగా చేసుకోవాలి. తరువాత ఉప్పు, కారం, చింతపండు రసం, పసుపు వేసి కలపాలి. తరువాత దీనిలో ఒక గ్లాస్ లేదా తగినన్ని నీళ్లు పోసి కలపాలి. ఈ పప్పును మరో 10 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై ఉడికించి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, ఇంగువ వేసి వేయించాలి. తరువాత కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి.
తాళింపు చక్కగా వేగిన తరువాత ముందుగా ఉడికించుకున్న పప్పును వేసి మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే తోటకూర పప్పు తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. తోటకూరతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా పప్పును కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఈ పప్పును ఆహారంగా తీసుకోవడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ తోటకూర పప్పును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.