Tomato Bendakaya Kura : మనం ఆహారంగా బెండకాయలను కూడా తీసుకుంటూ ఉంటాం. బెండకాయలతో చేసిన కూరలను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ బెండకాయలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. వీటితో ఎక్కువగా వేపుళ్లను, పులుసును తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా బెండకాయల్లో టమాటాలను వేసి కూరను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. వంట చేయడం తెలియని వారు కూడా ఈ కూరను చాలా సులభంగా తయారు చేయవచ్చు. రుచిగా టమాట బెండకాయ కూరను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట బెండకాయ కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన బెండకాయలు – పావు కిలో, చిన్నగా తరిగిన టమాటాలు – అర కిలో, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 1, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
టమాట బెండకాయ కూర తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బెండకాయ ముక్కలను వేసి కలుపుతూ వేయించుకోవాలి. బెండకాయ ముక్కలు పూర్తిగా వేగిన తరువాత వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే నూనెలో తాళింపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత టమాట ముక్కలు, పసుపు, ఉప్పు వేసి కలపాలి.తరువాత దీనిపై మూతను ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ టమాట ముక్కలను మెత్తగా ఉడికించుకోవాలి. టమాట ముక్కలు మెత్తగా ఉడికిన తరువాత ఇందులో కారం, ధనియాల పొడి, వేయించిన బెండకాయ ముక్కలు వేసి కలుపుకోవాలి.
తరువాత దీనిపై మూతను ఉంచి మరో పది నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించాలి. తరువాత కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట బెండకాయ కూర తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. బెండకాయతో ఎప్పుడూ వేపుడు, పులుసులనే కాకుండా ఇలా కూరను కూడా తయారు చేసి తీసుకోవచ్చు. ఈ టమాట బెండకాయ కూరను విడిచిపెట్టకుండా అందరూ ఇష్టంగా తింటారు. ఈ విధంగా బెండకాయలతో కూరను చేసుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.