South Indian Style Sambar : మనం కందిపప్పును ఉపయోగించి ఎంతో రుచిగా ఉండే సాంబార్ ను తయారు చేస్తూ ఉంటాం. సాంబార్ ను రుచి చూడని వారు ఉండరనే చెప్పవచ్చు. ఈ సాంబార్ ను రోజూ తినే వారు కూడా ఉంటారు. అన్నం, ఇడ్లీతో ఈ సాంబార్ ను ఎక్కువగా తింటూ ఉంటాం. చక్కగా వండాలే కానీ సాంబార్ చాలా రుచిగా ఉంటుంది. ఈ సాంబార్ ను పక్కా సౌత్ ఇండియన్ స్టైల్ లో రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సౌత్ ఇండియన్ సాంబార్ తయారీకి కావల్సిన పదార్థాలు..
కంది పప్పు – 150 గ్రా., సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు – 2, తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన ములక్కాయ – 1, నానబెట్టిన చింతపండు – 30 గ్రా., పొడుగ్గా తరిగిన క్యారెట్ – 1, పొడుగ్గా తరిగిన టమాటాలు – 2, సొరకాయ ముక్కలు – అర కప్పు, ఇంగువ – పావు టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 3, జీలకర్ర – ఒక టీ స్పూన్, కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, కొత్తిమీర – కొద్దిగా, కరివేపాకు – రెండు రెమ్మలు.
సాంబార్ మసాలా పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపప్పు – ఒక టేబుల్ స్పూన్, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 4, ఎండు కొబ్బరి – 50 గ్రా..
సౌత్ ఇండియన్ సాంబార్ తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో కందిపప్పును వేసి ఉడికించి మెత్తగా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో ఒక టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక సాంబార్ మసాలా పేస్ట్ కు కావల్సిన పదార్థాలు వేసి దోరగా వేయించుకోవాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ గా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత అదే కళాయిలో ఉడికించిన కందిపప్పు, ఒక గ్లాస్ నీళ్లు పోసి కలపాలి. తరువాత అందులో సొరకాయ, టమాట, క్యారెట్, మునక్కాయ,ఉల్లిపాయ ముక్కలతో పాటు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. తరువాత ఉప్పు, పసుపు వేసి కలిపి మూత పెట్టి పావు గంట పాటు ఉడికించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న సాంబార్ మసాలా వేసి కలపాలి. తరువాత కారం, చింతపండు రసం, మరో గ్లాస్ నీళ్లు పోసి కలపాలి. తరువాత ఈ సాంబార్ ను మరో పావు గంట పాటు మరిగించాలి.
ఇప్పుడు మరో కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఇంగువ, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఈ తాళింపును మరుగుతున్న సాంబార్ లో వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు మరిగించి చివరగా కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సాంబార్ తయారవుతుంది. ఈ సాంబార్ ను వేడి వేడిగా అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ సాంబార్ ను ఇడ్లీతో కూడా కలిపి తినవచ్చు. ఈ సాంబార్ ను ఒక్క చుక్క కూడా మిగల్చకుండా అందరూ ఇష్టంగా తింటారు.