Tomato Capsicum Pachadi : మనం ఆహారంగా క్యాప్సికంను కూడా తీసుకుంటూ ఉంటాం. క్యాప్సికంలో కూడా మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. వివిధ రకాల వంటకాల్లో వాడడంతో పాటు క్యాప్సికంతో కూరలను కూడా తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా క్యాప్సికంతో మనం ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. టమాటాలు వేసి చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. క్యాప్సికంతో రుచిగా, సులభంగా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట క్యాప్సికం పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన క్యాప్సికం – పావు కిలో, పల్లీలు – ఒక టేబుల్ స్పూన్, ధనియాలు – ఒక టీ స్పూన్, పచ్చిమిర్చి – 10 లేదా తగినన్ని, పసుపు – అర టీ స్పూన్, తరిగిన టమాటాలు – 2, చింతపండు – చిన్న నిమ్మకాయంత, ఉప్పు – తగినంత, వెల్లుల్లి రెబ్బలు – 5, జీలకర్ర – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నూనె – ఒక టేబుల్ స్పూన్.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ.
టమాట క్యాప్సికం పచ్చడి తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో పల్లీలు వేసి వేయించాలి. పల్లీలు వేగిన తరువాత ధనియాలు వేసి వేయించాలి. తరువాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక క్యాప్సకం ముక్కలు, పచ్చిమిర్చి వేసి 5 నిమిషాల పాటు వేయించాలి. తరువాత టమాట ముక్కలు, ఉప్పు, చింతపండు, పసుపు వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు జార్ లో వేయించిన పల్లీలను తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఇందులోనే వేయించిన క్యాప్సికం, టమాట ముక్కలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కొత్తిమీరను వేసి మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి.
ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి తాళింపు చేసుకోవాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత దీనిని ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట క్యాప్సికం పచ్చడి తయారవుతుంది. దీనిని అన్నం, నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. క్యాప్సికంతో తరచూ చేసే వంటకాలతో పాటు ఇలా పచ్చడిని కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఈ పచ్చడిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.