Tomato Drumsticks Masala Curry : మునక్కాయలు.. వీటిని కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. దాదాపు అన్నీ కాలాల్లో ఈ మునక్కాయలు మనకు లభిస్తూ ఉంటాయి. వీటిని తినడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మునక్కాయలు మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. మునక్కాయలతో చేసే వంటకాలు తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటాయి. అలాగే వీటితో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా మునక్కాయ టమాట మసాలా కూరను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట మునక్కాయ మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన మునక్కాయలు – 2, తరిగిన టమాటాలు – అర కిలో, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి -2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా – ఒక టేబుల్ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – 2 టేబుల్ స్పూన్స్, పసుపు – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, కరివేపాకు – ఒక రెమ్మ.
మసాలా పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, ఎండు కొబ్బరి ముక్కలు – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, లవంగాలు – 2, దాల్చిన చెక్క – అర ఇంచు ముక్క.
టమాట మునక్కాయ మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో మసాలా పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు వేసి దోరగా వేయించాలి. తరువాత వాటిని ఒక జార్ లోకి తీసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత మునక్కాయ ముక్కలు వేసి 10 నిమిషాల పాటు వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి కలిపి మూత పెట్టాలి. వీటిని మెత్తగా అయ్యే వరకు ఉడికించిన తరువాత మసాలా పొడి, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి కలపాలి.
తరువాత ఒక గ్లాస్ నీళ్లు పోసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి మరో నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట మునక్కాయ మసాలా కూర తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కూరను అందరూ ఇష్టంగా తింటారు. మునక్కాయలతో తరచూ చేసే వంటకాలతో పాటు ఇలా మసాలా కూరను కూడా తయారు చేసుకుని తినవచ్చు.