Vankaya Pachadi : వంకాయలను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని తినడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వంకాయలతో ఎంతో రుచిగా ఉండే వివిధ రకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. అలాగే వంకాయలతో ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. వంకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. మొదటిసారి చేసే వారు, వంటరాని వారు, బ్యాచిలర్స్ కూడా ఈ పచ్చడిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వంకాయలతో రుచిగా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వంకాయ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
వంకాయలు – పావు కిలో, పచ్చిమిర్చి – 10 లేదా తగినన్ని, తరిగిన టమాటాలు – 2, తాళింపు దినుసలు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 1, కరివేపాకు – ఒక రెమ్మ, నూనె – 3 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, జీలకర్ర – ఒక టీ స్పూన్, నానబెట్టిన చింతపండు – చిన్న నిమ్మకాయంత, వెల్లుల్లి రెబ్బలు – 6, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, పసుపు – అర టీ స్పూన్.
వంకాయ పచ్చడి తయారీ విదానం..
ముందుగా వంకాయలను తరిగి ఉప్పు నీటిలో వేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వంకాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. వంకాయ ముక్కలను పూర్తిగా మెత్తగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో టమాట ముక్కలను, చింతపండును, పసుపును వేసి కలపాలి. తరువాత వీటిపై మూతను ఉంచి మెత్తగా అయ్యే ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మిక్సీ జార్ లో వేయించిన వంకాయ ముక్కలు, వేయించిన టమాట ముక్కలు, జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి.
తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసి కలపాలి. ఈ పచ్చడిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ పచ్చడి తయారవుతుంది. ఈ పచ్చడిని వేడి వేడి అన్నం, నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. వంకాయలతో తరచూ చేసే కూరలతో పాటు అప్పుడప్పుడూ ఇలా రుచిగా పచ్చడిని కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఈ వంకాయ పచ్చడిని అందరూ ఇష్టంగా తింటారు.