Tomato Green Peas Curry : మనం వివిధ రకాల కూరగాయలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో బఠాణీలు కూడా ఒకటి. బఠాణీలలో మన శరీరానికి అవసరమయ్యే వివిధ రకాల పోషకాలు ఉంటాయి. వీటిని తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. ఎముకలు దృఢంగా ఉంటాయి.
ప్రోటీన్లు అధికంగా కలిగిన వాటిల్లో బఠాణీలు కూడా ఒకటి. కండపుష్టికి, దేహ దారుఢ్యం కోసం వ్యాయామాలు చేసే వారికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. బఠాణీలను మనం వివిధ రకాల వంటల తయారీలో ఉపయోగిస్తూ ఉంటాం. చాలా మంది బఠాణీలతో నేరుగా వంటలను కూడా తయారు చేస్తుంటారు. ఈ విధంగా బఠాణీలతో చేసే వంటకాలలో టమాట బఠాణీ కర్రీ కూడా ఒకటి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. చాలా సులువుగా, తక్కువ సమయంలోనే దీనిని తయారు చేసుకోవచ్చు. ఈ కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలి.. దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట బఠాణీ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
బఠాణీలు – ఒక కప్పు, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – అర కప్పు, తరిగిన పచ్చి మిర్చి – 2, టమాట పేస్ట్ – అర కప్పు, జీలకర్ర – ఒక టీ స్పూన్, కారం – ఒకటిన్నర టేబుల్ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ఉప్పు – రుచికి తగినంత, గరం మసాలా – పావు టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, నీళ్లు – ఒక కప్పు.
టమాట బఠాణీ కర్రీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి కాగిన తరువాత జీలకర్ర, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు బఠాణీలను వేసి కలిపి 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. తరువాత టమాట పేస్ట్ వేసి కలిపి నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తరువాత కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలిపి ఒక కప్పు నీళ్లను పోసి మూత పెట్టి బఠాణీలు పూర్తిగా ఉడికే వరకు ఉంచాలి. బఠాణీలు ఉడికిన తరువాత గరం మసాలా వేసి కలిపి మరో 3 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట బఠాణీ కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటి, పుల్కా వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉండడమే కాకుండా పోషకాలు కూడా లభిస్తాయి. ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.