Tomato Masala Oats : మనం ఓట్స్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. ఓట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బరువు తగ్గడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేయడంలో, శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఇలా అనేక రకాలుగా ఓట్స్ మనకు సహాయపడతాయి. ఓట్స్ ను మనం వివిధ రూపాల్లో తీసుకుంటూ ఉంటాము. మనం సులభంగా తయారు చేసుకోదగిన ఓట్స్ వెరైటీలలో టమాట మసాలా ఓట్స్ కూడా ఒకటి. టమాట మసాలా ఓట్స్ చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. అల్పాహారంగా, స్నాక్స్ గా తీసుకోవడానికి ఈ ఓట్స్ చాలా చక్కగా ఉంటాయి. రుచితో పాటుగా చక్కటి ఆరోగ్యాన్ని అందించే టమాట మసాలా ఓట్స్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట మసాలా ఓట్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన ఉల్లిపాయ – 1, కరివేపాకు – ఒక రెమ్మ, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, తరిగిన టమాటాలు – 200 గ్రా., నీళ్లు – పావు లీటర్, కారం – ఒక టీ స్పూన్, ఓట్స్ – 100 గ్రా., మిరియాల పొడి – పావు టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – అర కట్ట.
టమాట మసాలా ఓట్స్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిని 2 నిమిషాల పాటు వేయించిన తరువాత కరివేపాకు వేసి కలపాలి. ఉల్లిపాయ ముక్కలను పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలపాలి. తరువాత టమాట ముక్కలు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి టమాట ముక్కలను మెత్తగా మగ్గించాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి.
వీటిపై మూత పెట్టి నీటిని మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత కారం వేసి కలపాలి. తరువాత ఓట్స్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. వీటిని దగ్గర పడే వరకు మధ్యస్థ మంటపై ఉడికించిన తరువాత మిరియాల పొడి, గరంమసాలా వేసి కలపాలి. తరువాత కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట మసాలా ఓట్స్ తయారవుతాయి. ఈవిధంగా తయారు చేసుకున్న ఓట్స్ ను తినడం వల్ల మనం రుచితో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.