Tomato Pulao : టమాటాలతో మనం రకరకాల వంటకాలను, రైస్ వెరైటీస్ ను తయారు చేస్తూ ఉంటాం. టమాటాలతో చేసుకోదగిన రైస్ వెరైటీస్ లలో టమాట పులావ్ కూడా ఒకటి. చికెన్ బిర్యానీకి ఏ మాత్రం తక్కువ పోదు ఈ టమాట పులావ్. అలాగే దీనిని ఎవరైనా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. దీనిని చాలా తక్కువ సమయంలో మనం తయారు చేసుకోవచ్చు. రుచిగా అలాగే చాలా తక్కువ సమయంలో అయ్యేలా కుక్కర్ లో ఈ టమాట పులావ్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట పులావ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బాస్మతీ బియ్యం – ఒక గ్లాస్, టమాటాలు – 4 (మధ్యస్థంగా ఉన్నవి), ఎండుమిర్చి -5, పొట్టు వలిచిన వెల్లుల్లి రెబ్బలు – 5. ఉప్పు – తగినంత, వేడి నీళ్లు – ఒకటిన్నర గ్లాస్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, నెయ్యి – అర టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, దాల్చిన చెక్క – రెండు ఇంచుల ముక్క, లవంగాలు – 3, యాలకులు – 2, అనాస పువ్వు – 1, బిర్యానీ ఆకు – 1, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, కరివేపాకు – 2 రెమ్మలు, జీడిపప్పు పలుకులు – 2 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన చిన్న టమాట – 1, పసుపు – అర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
టమాట పులావ్ తయారీ విధానం..
ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి 15 నిమిషాల పాటు నానబెట్టాలి. తరువాత ఒక గిన్నెలో అర లీటర్ నీటిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఉప్పు, టమాటాలు వేసి ఉడికించాలి. టమాటాలు మెత్తగా ఉడికిన తరువాత నీటిని వడకట్టాలి. ఇప్పుడు టమాటాలపై ఉండే పొట్టును తీసేసి వాటిని ఒక జార్ లో వేసుకోవాలి. తరువాత ఉడికించిన పదార్థాలన్నింటిని కూడా అదే జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. ఇవి వేడయ్యాక మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీడిపప్పు పలుకులు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా అయ్యే వరకు వేయించిన తరువాత టమాట ముక్కలు వేసి కలపాలి.
టమాట ముక్కలు మెత్తగా ఉడికిన తరువాత మిక్సీ పట్టుకున్న టమాట ఫ్యూరీ ఒక కప్పు, ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత నానబెట్టుకున్న బియ్యం, కొత్తిమీర వేసి కలపాలి. తరువాత వేడి నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు కుక్కర్ పై మూతను ఉంచి మధ్యస్థ మంటపై 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట పులావ్ తయారవుతుంది. దీనిని రైతాతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి ఈ పులావ్ చక్కగా ఉంటుంది. నోటికి రుచిగా ఏదైనా తినాలనిపించినప్పుడు, ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, వంట చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు ఇలా టమాటాలతో పులావ్ ను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.