Tomato Roti Pachadi : మనం వంటింట్లో ఎక్కువగా ఉపయోగించే కూరగాయల్లో టమాటాలు ఒకటి. టమాటాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. టమాటాలను ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. టమాటాలతో మనం కూరలతో పాటు రకరకాల పచ్చళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాం. టమాటాలతో చేసే పచ్చళ్లు చాలా రుచిగా ఉంటాయి. టమాటాలతో చేసుకోదగిన వివిధ రకాల పచ్చళ్లల్లో టమాట రోటి పచ్చడి కూడా ఒకటి. పచ్చిమిర్చి, టమాటాలు కలిపి చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చాలా తక్కువ సమయంలో, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. లొట్టలేసుకుంటూ తినేంత రుచిగా టమాట రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట రోటి పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన టమాటాలు – 500 గ్రా., పచ్చిమిర్చి – 50 గ్రా., చింతపండు – చిన్న నిమ్మకాయంత, జీలకర్ర – ఒక టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 6, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – ఒక టేబుల్ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.

టమాట రోటి పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పచ్చిమిర్చి, టమాట ముక్కలు వేసి వేయించాలి. తరువాత వీటిపై మూత పెట్టి ఉడికించాలి. టమాటాలు ఉడికిన తరువాత చింతపండు, పసుపు వేసి కలపాలి. తరువాత మూత పెట్టకుండా టమాటలోని నీరంతా పోయే వరకు ఉడికించాలి. టమాట దగ్గర పడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు రోట్లో పచ్చిమిర్చి, ఉప్పు వేసి మెత్తగా దంచాలి. తరువాట టమాట ముక్కలు వేసి దంచాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, కొత్తిమీర వేసి దంచి గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట రోటి పచ్చడి తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. జార్ లో కంటే ఈ విధంగా రోట్లో వేసి చేస్తేనే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.