Tomato Upma : మనం ఉదయం పూట అల్పాహారంగా తయారు చేసుకునే వాటిల్లో ఉప్మా ఒకటి. ఉప్మాను తయారు చేయడం చాలా తేలిక. దీనిని ఇష్టపడే వారు కూడా మనలో చాలా మందే ఉన్నారు. సాధారణంగా తరచూ చేసే ఉప్మా కంటే కింద చెప్పిన విధంగా చేసే టమాట ఉప్మా మరింత రుచిగా ఉంటుంది. అలాగే దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. ఉదయం పూట సమయం తక్కువగా ఉన్నప్పుడు, అల్పాహారంగా ఏం చేయాలో తోచనప్పుడు ఎంతో రుచిగా ఉండే టమాట ఉప్మాను తయారు చేసుకుని తినవచ్చు. ఎంతో రుచిగా ఉండే టమాట ఉప్మాను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట ఉప్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
బొంబాయి రవ్వ – ఒక కప్పు, చిన్న ముక్కలుగా తరిగిన టమాటాలు – 2, జీడిపప్పు పలుకులు – 10, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్న ముక్కలుగా తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, పసుపు – అర టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత.
టమాట ఉప్మా తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, జీడిపప్పు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత టమాట ముక్కలు, పసును వేసి కలపాలి. టమాట ముక్కలను మెత్తగా అయ్యే వేయించిన తరువాత 3 కప్పుల నీళ్లు పోసి కలపాలి. తరువాత తగినంత ఉప్పు వేసి నీటిని మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత రవ్వను వేసి కలపాలి. ఈ రవ్వను ఉండలు లేకుండా కలుపుకుని దగ్గర పడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట ఉప్మా తయారవుతుంది. దీనిని పల్లి చట్నీ, టమాట చట్నీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఉదయం పూట అప్పుడప్పుడూ ఇలా టమాట ఉప్మాను కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఉప్మా అంటే ఇష్టం లేని వారు కూడా ఈ ఉప్మాను ఎంతో ఇష్టంగా తింటారు.