Top 5 Dangerous Roads In India : ఎటు చూసినా పచ్చని ప్రకృతి.. రమణీయమైన వాతావరణం.. మేఘాల్లో కలుస్తున్నాయా అన్నట్లుగా ఉండే ఎత్తైన పర్వతాలు.. వాటిపై పాములాంటి మెలికలతో ఉండే రోడ్లు.. అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో కారులో జామ్ అని వెళ్తుంటే వచ్చే మజాయే వేరు. అయితే అలాంటి మెలికలు తిరిగిన రోడ్లలో మనకు ఎంత ఆహ్లాదం లభిస్తుందో.. అంతకన్నా డేంజర్ ఆ రోడ్లలో పొంచి ఉంటుంది. అవును మరి. పర్వతసానువుల్లో ఉండే రోడ్లంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఆదమరిచి డ్రైవ్ చేస్తే వాహనం లోయలోకి పడిపోతుంది. కనుక అలాంటి రోడ్లపై ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే అలాంటి రోడ్లు ఎక్కడున్నాయి ? అనేగా మీ డౌట్..! ఏమీ లేదండీ.. మీరు అంతగా డౌట్ పడాల్సిన పనిలేదు. ఎందుకంటే అలాంటి ప్రమాదకరమైన మలుపులు ఉన్న రోడ్లు మన దేశంలోనే ఉన్నాయి. వాటి గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1. జొజి లా
లెహ్ నుంచి శ్రీనగర్ వెళ్లే దారిలో ఈ రోడ్డు ఉంటుంది. ఇది సముద్ర మట్టానికి సుమారుగా 11వేల అడుగుల ఎత్తులో పర్వతాలపై ఉంటుంది. ఈ రోడ్డులో ప్రయాణించేటప్పుడు చక్కని ప్రకృతి రమణీయమైన దృశ్యాలు మనకు కనిపిస్తాయి. కానీ ఈ రోడ్డు మాత్రం ప్రయాణించేందుకు చాలా డేంజర్‌గా ఉంటుంది. మీరు సాహసికులు అయితే ఈ రోడ్డులో వెళ్లవచ్చు. కానీ ప్రయాణంలో కిందకు మాత్రం చూడకండి. కళ్లు తిరుగుతాయి. ఇక ఈ రోడ్డులో ప్రయాణించేటప్పుడు అప్పుడప్పుడు మనకు అనేక ప్రకృతి విపత్తులు కూడా ఎదురవుతుంటాయి. బురదగా ఉండే రోడ్లు, మంచు తుపాన్లు, కొండచరియలు విరిగి పడడం, బలమైన గాలులు మనల్ని పలకరిస్తాయి. వీటిని తట్టుకుని వెళ్లగలం అనుకుంటేనే ఈ రోడ్డులో ప్రయాణించాలి.
2. కిన్నౌర్ రోడ్డు
హిమాచల్ ప్రదేశ్‌కు నైరుతి దిశలో ఈ రోడ్డు ఉంటుంది. ఇక్కడి పర్వతాలపై ఉండే రాళ్లను తొలిచి రోడ్డును వేశారు. అందువల్ల మలుపులు మరీ ఎక్కువగా ఉంటాయి. అలాగే రోడ్డు మార్గంలో కొన్ని చోట్ల షార్ప్, బ్లైండ్ టర్న్‌లు ఉంటాయి. వాటి వద్ద ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇక సాహసం చేసేవారికి ఈ రోడ్డు సవాల్ విసురుతుంది. ఎక్స్‌పీరియెన్స్ ఉన్న డ్రైవర్లే ఈ రోడ్డులో వాహనాన్ని నడపాలంటే జంకుతారు. కనుక ధైర్యంగా ఉంటేనే ఈ రోడ్డులో వాహనం నడపాలి.
3. ఖార్దుంగ్ లా
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశాలలో ఉన్న రోడ్డులలో ఈ రోడ్డు కూడా ఒకటి. దీన్ని ఇండియన్ ఆర్మీ వారు నిర్మించారు. అందుకు వారు చాలా కష్టపడ్డారు. ఈ రోడ్డు ఉండే పర్వత శ్రేణులు సముద్ర మట్టానికి సుమారుగా 18,380 అడుగుల ఎత్తులో ఉంటాయి. ఇక అంత ఎత్తులో చలి బాగా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. దీంతో ఈ రోడ్డులో ప్రయాణించే వారు వాహనాల్లో ఆక్సిజన్ మాస్కులను పెట్టుకుంటారు.
4. లెహ్-మనాలి హైవే
ఈ రోడ్డు దాదాపుగా 479 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ రోడ్డులో ప్రయాణించేటప్పుడు కూడా మనకు చక్కని ప్రకృతి అందాలు కనిపిస్తాయి. కానీ అదే స్థాయిలో డేంజర్లు కూడా ఉంటాయి. మెలికలు తిరుగుతూ రోడ్డుపై వెళ్తుంటే ఎంతటి అనుభవం ఉన్న డ్రైవర్‌కైనా భయం వేస్తుంది.
5. రోహ్తంగ్ పాస్
హిమాచల్ ప్రదేశ్‌లో హిమాలయ పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి దాదాపుగా 3978 మీటర్ల ఎత్తులో ఈ రోడ్డు ఉంటుంది. ఇది ఇండియాలోనే అత్యంత ప్రమాదకరమైన రోడ్డుగా పేరుగాంచింది. ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే వాహనదారులకు గట్స్ ఉండాలి. ఎందుకంటే ఈ రోడ్డుపై ఉండే మలుపుల్లో ప్రయాణించడం అంత సులభం కాదు. ఎదురుగా వచ్చే వాహనాలను తప్పించుకుంటూ చాకచక్యంగా వాహనం నడపాలి. అదుపు తప్పినా, చిన్న తప్పు చేసినా వాహనం లోయలోకి పడిపోతుంది. ఇక ఈ రోడ్డు ఉన్న పర్వత శ్రేణుల పైభాగం నుంచి తరచూ కొండ చరియలు కింద పడుతుంటాయి. దీంతో అనేక ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. సాహసం చేయాలనుకునే వారికి ఈ రోడ్డు మంచి ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంది.