Upma Bonda : మనం వంటింట్లో అల్పాహారంగా ఉప్మాను తయారు చేస్తూ ఉంటాం. చక్కగా వండాలే కానీ ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. ఎంత రుచిగా వండినప్పటికి మనలో చాలా మంది ఉప్మాను తినడానికి ఇష్టపడరు. ఉప్మాను తినలేని వారు అదే ఉప్మాతో ఎంతో రుచిగా ఉండే బోండాలను తయారు చేసుకుని తినవచ్చు. ఉప్మాతో బోండాలు తయారు చేయడం చాలా తేలిక. ఇవి చాలా రుచిగా కూడా ఉంటాయి. ఉప్మాతో బోండాలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఉప్మా బోండా తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపిండి – ఒక కప్పు, బియ్యం పిండి – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, వాము – పావు టీ స్పూన్, వంటసోడా – పావు టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
ఉప్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
బొంబాయి రవ్వ – ఒక టీ గ్లాస్, నూనె – ఒక టేబుల్ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, నీళ్లు – రెండున్నర టీ గ్లాసులు, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ఉప్మా బోండా తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం తరుగు, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే ఉప్పు వేసి నీటిని మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత ఉప్మాను వేసి కలపాలి. దీనిని ఉండలు లేకుండా కలిపి దగ్గర పడే వరకు ఉడికించాలి. తరువాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ఉప్మాను పూర్తిగా చల్లారే వరకు పక్కకు ఉంచాలి. తరువాత ఒక గిన్నెలో శనగపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ బజ్జీ పిండిలా కలుపుకోవాలి.
ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న ఉప్మాను ఉండలుగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె పపోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉప్మా ఉండలను శనగపిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేసుకోవాలి. ఈ బోండాలను కొద్దిగా కాలిన తరువాత అటూ ఇటూ కదుపుతూ వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉప్మా బోండాలు తయారవుతాయి. వీటిని పల్లి చట్నీ, టమాట కిచప్ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఉప్మాను తినడానికి ఇష్టపడని వారు కూడా ఈ బోండాలను ఇష్టంగా తింటారు. ఉదయం అల్పాహారంగా లేదా సాయంత్రం స్నాక్స్ గా ఈ బోండాలను తయారు చేసుకుని తినవచ్చు.