Constipation : అస్తవ్యస్థమైన జీవన విధానం కారణంగా తలెత్తే అనారోగ్య సమస్యల్లో మలబద్దకం కూడా ఒకటి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. మలబద్దకం సమస్య రావడానికి అనేక కారణాలు ఉంటాయి. నీటిని తక్కువగా తాగడం, తగినంత శారీరక వ్యాయామం చేయకపోవడం, ఫైబర్ తక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వంటి అనేక రకాల వల్ల మలబద్దకం సమస్య తలెత్తుతుంది. మలబద్దకం సమస్యే కదా అని దీనిని నిర్లక్ష్యం చేయకూడదు. మన శరీరంలో వచ్చే సగం అనారోగ్య సమస్యలకు ఇదే కారణమవుతుంది. మలబద్దకం కారణంగా గ్యాస్, పుల్లటి త్రేన్పులు, కడుపు నొప్పి, చికాకు, ఆకలి లేకపోవడం, నిరుత్సాహంగా ఉండడం వంటి అనేక ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
కనుక మనం సాధ్యమైనంత వరకు ఈ సమస్య నుండి బయట పడడం చాలా అవసరం. కొన్ని చిట్కాలను పాటించడం వల్ల మనం చాలా సులభంగా ఈ సమస్య నుండి బయట పడవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ యోగా, వాకింగ్, జాజింగ్, రన్నింగ్ వంటి వాటిని చేయాలి. చక్కటి జీవన విధానాన్ని అవలంబించాలి. అలాగే ప్రతిరోజూ ప్రాణాయామం, కఫాలభాతి చేయాలి. ఇలా చేయడం వల్ల పొట్ట బాగా కదులుతుంది. దీంతో మలబద్దకం సమస్య నుండి బయటపడవచ్చు. అదే విధంగా అజీర్ణం చేసే ఆహారాలను తీసుకోకూడదు. హడావిడిగా ఎప్పుడూ కూడా భోజనం చేయకూడదు. ఎల్లప్పుడూ కింద కూర్చోని నెమ్మదిగా బాగా నములుతూ భోజనం చేయాలి. సులభంగా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవాలి. అలాగే మనం తీసుకునే ఆహారాలను కూడా బాగా ఉడికించాలి. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.
ఆకుకూరలను అధికంగా తీసుకోవాలి. అన్నింటి కంటే ముఖ్యంగా నీటిని ఎక్కువగా తాగాలి. అయితే భోజనం చేసేటప్పుడు నీటిని తాగకూడదు. భోజనం చేసిన 40 నిమిషాల తరువాత అలాగే భోజనానికి అరగంట ముందు మాత్రమే నీటిని తాగాలి. అలాగే ఒత్తిడి, ఆందోళన వంటి వాటికి దూరంగా ఉండాలి. జంక్ ఫుడ్ ను, నూనెలో వేయించిన పదార్థాలను ఎక్కువగా తినకూడదు. ఈ చిట్కాలను పాటించడం వల్ల మనం చాలా సులభంగా మలబద్దకం సమస్య నుండి బయటపడవచ్చు. మలబద్దకం సమస్యను నివారించుకోవడం వల్ల మనం అనేక ఇతర అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. మలబద్దకం సమస్య తగ్గడం వల్ల శారీరక ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.