Vankaya Kothimeera Karam : మనం వంకాయలతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. వంకాయలతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. వంకాయలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో వంకాయ కొత్తిమీర కారం కూడా ఒకటి. వంకాయలతో చేసే ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. వంకాయలను తినని వారు కూడా ఈ వంటకాన్ని ఇష్టంగా తింటారు. ఈ వంకాయ కొత్తిమీర కారాన్ని తయారు చేయడం చాలా సులభం. ఎవరైనా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ వంకాయ కొత్తిమీర కారాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వంకాయ కొత్తిమీర కారం తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చిమిర్చి – 6, కొత్తిమీర – ఒక పెద్ద కట్ట, జీలకర్ర – ఒక టీ స్పూన్, నూనె – 3 టేబుల్ స్పూన్స్, తరిగిన వంకాయలు – 400 గ్రా., ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, నీళ్లు – 75 ఎమ్ ఎల్.
వంకాయ కొత్తిమీర కారం తయారీ విధానం..
ముందుగా జార్ లో పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర వేసుకోవాలి. తరువాత ఒక టేబుల్ స్పూన్ నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వంకాయలు వేసి వేయించాలి. వీటిని 3 నిమిషాల పాటు వేయించిన తరువాత ఉప్పు, పసుపు వేసి కలపాలి. వీటిని మరో రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు వీటిపై మూత పెట్టి ఉడికించాలి. వంకాయ ముక్కలు వేగి నూనె పైకి తేలిన తరువాత మిక్సీ పట్టుకున్న కారం వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి పచ్చి వాసన పోయే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ కొత్తిమీర కారం తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా తయారు చేసిన కారాన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. వంకాయలతో తరుచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా వెరైటీగా కూడా చేసుకుని తినవచ్చు.