Vankaya Perugu Kura : వంకాయలతో చాలా మంది సహజంగానే అనేక రకాల కూరలు చేస్తుంటారు. వంకాయ వేపుడు, పచ్చడి, కుర్మా వంటివి చేస్తుంటారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అయితే వంకాయలతో పెరుగు కలిపి కూడా వండుకోవచ్చు. ఇది కూడా అందరికీ నచ్చుతుంది. దీన్ని తయారు చేయడం కూడా సులభమే. వంకాయ పెరుగు కూరను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వంకాయ పెరుగు కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
పెరుగు – ఒకటిన్నర కప్పు, నూనె – 5 టీస్పూన్లు, వంకాయలు – ఆరు, జీలకర్ర – ఒక టీస్పూన్, బిర్యానీ ఆకు – ఒకటి, ఉల్లిపాయ – ఒకటి, అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీస్పూన్, శనగపిండి – రెండు టీస్పూన్లు, పసుపు – పావు టీస్పూన్, కారం – ఒక టీస్పూన్, ధనియాల పొడి – అర టీస్పూన్, గరం మసాలా – పావు టీస్పూన్, నీళ్లు – అర కప్పు, ఉప్పు – తగినంత, కసూరీ మేథీ – ఒక టీస్పూన్, కొత్తిమీర – ఒక కట్ట, ఇంగువ – కొద్దిగా.
వంకాయ పెరుగు కూరను తయారు చేసే విధానం..
స్టవ్ మీద కడాయి పెట్టి మూడు టీస్పూన్ల నూనె వేసి వంకాయ ముక్కల్ని వేయించి తీసుకోవాలి. అదే బాణలిలో మిగిలిన నూనె వేసి జీలకర్ర, బిర్యానీ ఆకు, ఇంగువ వేయించి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి ముద్ద వేయాలి. ఇవి కూడా వేగాక శనగపిండి వేసి వేయించి పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, నీళ్లు పోసి బాగా కలపాలి. నిమిషం అయ్యాక పెరుగు వేసి కలిపి ఉప్పు, వేయించిన వంకాయ ముక్కలను వేసి స్టవ్‌ని సిమ్‌లో పెట్టాలి. ఇది ఉడుకుతున్నప్పుడు కసూరీ మేథీ, కొత్తిమీర తరుగు వేసి దింపేయాలి. దీంతో రుచికరమైన వంకాయ పెరుగు కూర తయారవుతుంది. దీన్ని అన్నం, చపాతీలు, రోటీలు.. వేటితో తిన్నా సరే రుచిగా ఉంటుంది. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.