Vankaya Tomato Pachadi : మనం వంకాయలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వంకాయలతో చేసే కూరలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. వంకాయలను తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. వంకాయలతో కూరలే కాకుండా మనం పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. టమాటాలు వేసి చేసే ఈ వంకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. వంటరాని వారు, బ్యాచిలర్స్ ఇలా ఎవరైనా దీనిని తేలికగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే వంకాయ టమాట పచ్చడి తయారీ విధానాన్ని అలాగే దీనికి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వంకాయ టమాట పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన వంకాయలు – 2, తరిగిన టమాటాలు – 4, పచ్చిమిర్చి – 6 లేదా తగినన్ని, నూనె – ఒక టేబుల్ స్పూన్, మినపప్పు – 2 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, వెల్లుల్లి రెబ్బలు – 6, జీలకర్ర – ఒక టీ స్పూన్, చింతపండు – ఒక రెమ్మ.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్,ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ.
వంకాయ టమాట పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత మినపప్పు వేసి వేయించాలి. మినపప్పు చక్కగా వేగిన తరువాత దీనిని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు అదే నూనెలో పచ్చిమిర్చి వేసి వేయించాలి. పచ్చిమిర్చి వేగిన తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత అదే నూనెలో వంకాయ ముక్కలు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి సగానికి పైగా వేయించాలి. వంకాయ ముక్కలు కొద్దిగా వేగిన తరువాత టమాట ముక్కలు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ టమాట, వంకాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు జార్ లో వేయించిన మినపప్పు, పచ్చిమిర్చి, ఉప్పు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
తరువాత వేయించిన టమాట, వంకాయ ముక్కలు వేసి కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలు వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత దీనిని పచ్చడిలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ టమాట పచ్చడి తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని అందరూ లొట్టలేసుకుంటూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.