Vankaya Vepudu : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో వంకాయలు కూడా ఒకటి. వంకాయలు పోషకాలతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగి ఉన్నాయి. వీటిని కూడా తప్పకుండా ఆహారంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు. వంకాయలతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. వాటిల్లో వంకాయ వేపుడు కూడా ఒకటి. వంకాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఒక్కొక్కరు ఒక్కోలా తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా కారం పొడి వేసి చేసే వంకాయ వేపుడు కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా సులభంగా చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. రుచిగా, కమ్మగా ఉండే ఈ వంకాయ వేపుడును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వంకాయ వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
ఎండు కొబ్బరి ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, పుట్నాల పప్పు – 4 టేబుల్ స్పూన్స్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, వెల్లుల్లి రెబ్బలు – 8, జీలకర్ర – ఒక టీ స్పూన్, పొడుగు వంకాయలు – పావు కిలో, నూనె – 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు – రెండు రెమ్మలు.
వంకాయవేపుడు తయారీ విధానం..
ముందుగా జార్ లో కొబ్బరి ముక్కలు, పుట్నాల పప్పు, కారం, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత జీలకర్ర వేసి మరోసారి మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. తరువాత వంకాయలను నిలువుగా రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వంకాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిని పూర్తిగా వేయించిన తరువాత కరివేపాకు వేసి వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పొడిని వేసుకోవాలి. ఈ పొడిని మొత్తం వేసుకోవచ్చు లేదా మనకు తగినంత వేసుకోవచ్చు.
దీనిని మరో నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ వేపుడు తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ వేపుడుకు చిన్నగా సన్నగా పొడుగ్గా ఉండే వంకాయలను తీసుకుంటే వేపుడు మరింత రుచిగా ఉంటుంది. వంకాయలను తినని వారు కూడా ఈ విధంగా చేసిన వంకాయ వేపుడును అడిగి మరీ తింటారు.