Veg Fried Rice : మనకు రెస్టారెంట్ లలో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లల్లో ఎక్కువగా లభించే పదార్థాల్లో వెజ్ ఫ్రైడ్ రైస్ ఒకటి. వెజ్ ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ ఫ్రైడ్ రైస్ ను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. బయట లభించే విధంగా ఉండే ఫ్రైడ్ రైస్ ను అదే రుచితో ఇంట్లో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వంటరాని వారు, మొదటి సారి చేసే వారు, బ్యాచిలర్స్ ఇలా ఎవరైనా దీనిని చేసుకోవచ్చు. అన్నం రెడీగా ఉండాలే కానీ దీనిని కేవలం నిమిషాల వ్యవధిలో తయారు చేసుకోవచ్చు. వెజ్ ఫ్రైడ్ రైస్ ను రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వెజ్ ఫ్రైడ్ రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
అన్నం – 2 కప్పుల బాస్మతీ బియ్యంతో వండినంత, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన పచ్చిమిర్చి – 3, వెల్లుల్లి తరుగు – ఒక టీ స్పూన్, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన క్యారెట్ – 1, చిన్నగా తరిగిన బీన్స్ – 8, క్యాబేజ్ తురుము – ఒక కప్పు, ఉప్పు – తగినంత, కారం – అర టీ స్పూన్, సోయా సాస్ – ఒక టీ స్పూన్, వెనిగర్ – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.

వెజ్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం..
ముందుగా వెడల్పుగా ఉండే ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిని పెద్ద మంటపై పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత క్యారెట్, బీన్స్, క్యాబేజ్ తురుము వేసి వేయించాలి. వీటిని కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత అన్నం, సోయా సాస్, వెనిగర్, ఉప్పు, కారం, మిరియాల పొడి వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ ఫ్రైడ్ రైస్ ను 5 నిమిషాల పాటు బాగా కలుపుతూ వేయించిన తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వెజ్ ఫ్రైడ్ రైస్ తయారవుతుంది. దీనిని పెరుగు చట్నీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో లేదా మధ్యాహ్నం లంచ్ బాక్స్ లోకి ఇలా వెజ్ ఫ్రైడ్ రైస్ ను తయారు చేసుకుని తినవచ్చు. ఈ ఫ్రైడ్ రైస్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.