Vellulli Karam Kodi Vepudu : వెల్లుల్లి కారం కోడి వేపుడు.. కింద చెప్పిన వెల్లుల్లి కారం వేసి చేసే ఈ చికెన్ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి దీనిని రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలని అడగక మానరు. సైడ్ డిష్ గా, స్టాటర్ గా తినడానికి ఈ చికెన్ వేపుడు చాలా చక్కగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. తరచూ ఒకేరకం చికెన్ వేపుళ్లను తిని తిని బోర్ కొట్టిన వారు ఇలా వెరైటీగా వెల్లుల్లి కారం కోడి వేపుడును ట్రై చేయవచ్చు. బ్యాచిలర్స్, వంటరాని వారు, మొదటిసారి చేసే వారు ఇలా ఎవరైనా దీనిని సులభంగా తయారు చేయవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ వెల్లుల్లి కారం చికెన్ వేపుడును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వెల్లుల్లి కారం కోడి వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 3 లేదా 4 టేబుల్ స్పూన్స్, చికెన్ – అరకిలో, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన టమాట – 1, కరివేపాకు -ఒక రెమ్మ, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
వెల్లుల్లి కారం తయారీకి కావల్సిన పదార్థాలు..
దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, యాలకులు – 2, లవంగాలు – 4, జీలకర్ర – అర టీ స్పూన్, మిరియాలు – అర టీ స్పూన్, ధనియాలు – 2 టీ స్పూన్స్, కారం – ఒక టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 10.
వెల్లుల్లి కారం కోడి వేపుడు తయారీ విధానం..
ముందుగా జార్ లో వెల్లుల్లి కారానికి కావల్సిన పదార్థాలు వేసుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి దీనిని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత చికెన్ వేసి కలపాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, టమాట ముక్కలు, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి కలపాలి. ఇప్పుడు ఈ చికెన్ ను మధ్యస్థ మంటపై కలుపుతూ వేయించాలి.
చికెన్ పూర్తిగా వేగి నూనె పైకి తేలిన తరువాత మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారం వేసి కలపాలి. తరువాత మంటను చిన్నగా చేసి రెండు నిమిషాల పాటు వేయించాలి. ఇలా వేయించిన తరువాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మరో 3 నిమిషాల పాటు వేయించాలి. చివరగా మరో రెబ్బ కరివేపాకు, నిమ్మరసం, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి కారం కోడి వేపుడు తయారవుతుంది. ఒక్క ముక్క కూడా విడిచి పెట్టకుండా అందరూ దీనిని ఇష్టంగా తింటారు.