Gods : హిందువుల్లో చాలా మంది భక్తులు తమ ఇష్టానికి అనుగుణంగా తమ తమ ఇష్ట దైవాలకు ఆయా రోజుల్లో ఆయా వేళల్లో పూజలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు ఉదయం పూజ చేస్తే కొందరు సాయంత్రం పూట, ఇంకా కొందరు రెండు వేళల్లోనూ పూజలు చేస్తారు. అయితే పురాణాలు చెబుతున్న ప్రకారం ఏ దేవున్నయినా, దేవతనైనా పలు నిర్దిష్ట సమయాల్లో పూజిస్తే దాంతో వారి అనుగ్రహం ఇంకా ఎక్కువ లభిస్తుందట. ఈ క్రమంలో ఏయే దేవుళ్లను ఏయే వేళల్లో పూజిస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
సూర్య భగవానున్ని ఉదయం 4.30 నుంచి 6 గంటలలోగా పూజించాలి. ఈ సమయంలో శ్రీరాముడు, వెంకటేశ్వరులను కూడా పూజించవచ్చు. ఇలా చేయడం వల్ల వారి అనుగ్రహం మిక్కిలిగా లభిస్తుంది. ఉదయం 6 నుంచి 7.30 గంటల మధ్య మహాశివున్ని పూజించాలట. ఆయనతోపాటు దుర్గాదేవిని కూడా పూజించవచ్చట. అలా చేస్తే అనుకున్నవి నెరవేరుతాయట. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆంజనేయ స్వామిని పూజించాలట. ఆయన కృపకు మరింత పాత్రులు కావాలంటే ఆ సమయమే మంచిదని పండితులు చెబుతున్నారు.
నవగ్రహాల్లో ఒకటైన రాహువును మధ్యాహ్నం 3 గంటలకు పూజించాలట. దీంతో ఎక్కువ ఫలితం లభిస్తుందట. సాయంత్రం 6 గంటల సమయంలోనూ శివున్ని పూజించవచ్చట. రాత్రి 6 నుంచి 9 గంటల మధ్య లక్ష్మీదేవిని పూజించాలట. దీంతో ఆమె కరుణా కటాక్షాలు ఎక్కువగా ఉంటాయట. ధనం బాగా కలుగుతుందట. ఐశ్వర్యవంతులవుతారట. తెల్లవారు జామున 3 గంటలకు శ్రీమహా విష్ణువును పూజిస్తే వైకుంఠ వాసుడి దయ అపారంగా లభిస్తుందట. ఆయన అనుగ్రహం పొందాలంటే ఆ సమయంలో పూజ చేయాలట. సాధారణంగా ఏ దేవుడు లేదా దేవతకైనా ఎప్పుడైనా పూజ చేయవచ్చు. అయితే పైన చెప్పిన ప్రకారం పూజ చేస్తే మిక్కిలి ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు.