Wheat Flour Jamun : గోధుమలను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. గోధుమలను పిండిగా చేసి చపాతీ, రోటి, పుల్కా వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా గోధుమ పిండితో మనం తీపి వంటకాలను కూడా తయారు చేసుకోవచ్చు. గోధుమ పిండితో చేసుకోదగిన తీపి వంటకాల్లో జామున్స్ ఒకటి. రెడీమెగ్ మిక్స్ తో కాకుండా ఇలా గోధుమ పిండితో కూడా జామున్స్ ను తయారు చేసుకోవచ్చు. రుచిగా చాలా తక్కువ సమయంలో, చాలా సులభంగా గోధుమ పిండితో జామున్స్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వీట్ ఫ్లోర్ జామున్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమపిండి – ఒక కప్పు, పాలు – ఒక కప్పు, పంచదార – ఒక కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్, నీళ్లు – రెండు కప్పులు, కుంకుమ పువ్వు – చిటికెడు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
వీట్ ఫ్లోర్ జామున్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో పంచదార, నీళ్లు పోసి వేడి చేయాలి. పంచదార కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. పంచదార కరిగి తీగ పాకం కంటే కొద్దిగా తక్కువగా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మరో కళాయిలో పాలు, యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి కలుపుతూ వేడి చేయాలి. పాలు ఒక పొంగు వచ్చిన తరువాత గోధుమ పిండి వేసి అంతా కలిసేలా బాగా కలపాలి. ఈ పిండిని కళాయికి అంటుకోకూండా ఉండే వరకు కలుపుతూ వేడి చేయాలి. ఇలా పిండి కళాయికి అంటుకోకుండా అయిన తరువాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పిండి చల్లారిన తరువాత చేత్తో బాగా కలపాలి. తరువాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ఉండలుగా చేసుకోవాలి.
ఈ పిండిని ఉండలుగానే కాకుండా మనకు నచ్చిన ఆకారంలో చేసుకోవచ్చు. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తగినన్ని జామున్స్ ను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు వేయించి ముందుగా తయారు చేసుకున్న పంచదార పాకంలో వేయాలి. వీటిని పది నిమిషాల పాటు పంచదార పాకంలో ఉంచిప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే జామున్స్ తయారవుతాయి. తీపి తినాలనిపించినప్పుడు ఇలా గోధుమ పిండితో ఎంతో రుచిగా ఉండే జామున్స్ ను తయారు చేసుకుని తినవచ్చు. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.