Wheat Rava Kichdi : ఉదయం పూట అల్పాహారంగా దీనిని ఒక కప్పు తీసుకుంటే చాలా నీరసం, నిస్సత్తువ వంటివి మన దరి చేరకుండా ఉంటాయి. అలాగే దీనిని తీసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు ఒక కప్పు దీనిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. షుగర్ వ్యాధి గ్రస్తులకు కూడా ఇది ఒక చక్కటి ఆహారమని చెప్పవచ్చు. పిల్లలతో పాటు పెద్దలు కూడా దీనిని చక్కగా తినవచ్చు. మలబద్దకం, అజీర్తి వంటి సమస్యలతో బాధపడే వారు దీనిని తీసుకోవడం వల్ల ఆయా సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ వంటకం ఏమిటి.. దీనిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకందాం.
గోధుమ రవ్వ కిచిడీ తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపప్పు – ఒక టీ స్పూన్, పెసరపప్పు – ఒక టేబుల్ స్పూన్, కందిపప్పు – ఒక టేబుల్ స్పూన్, ఎర్ర పప్పు – ఒక టేబుల్ స్పూన్, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, గోధుమరవ్వ – అర కప్పు, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన పచ్చిమిర్చి – 1, తరిగిన పాలకూర – ఒక కప్పు, పచ్చి బఠాణీ – అర కప్పు, క్యారెట్ ముక్కలు – అర కప్పు, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, తరిగిన టమాట – 1, నీళ్లు – 6 కప్పులు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నిమ్మరసం – అర చెక్క.
గోధుమ రవ్వ కిచిడి తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో శనగపప్పు, పెసరపప్పు, కందిపప్పు, ఎర్రపప్పు వేసి శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టాలి. తరువాత కుక్కర్ లో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక గోధుమరవ్వ వేసి వేయించాలి. గోధుమ రవ్వను ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అందులోనే మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక జీలకర్ర, ఇంగువ వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. తరువాత అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. పచ్చిమిర్చి చక్కగా వేగిన తరువాత పాలకూర వేసి కలపాలి. తరువాత క్యారెట్ ముక్కలు, బఠాణీ వేసి కలపాలి. వీటిని 2 నిమిషాల పాటు వేయించిన తరువాత ముందుగా నానబెట్టుకున్న పప్పులను వేసి కలపాలి.
తరువాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలపాలి. వీటిని మరో నిమిషం పాటు కలుపుతూ వేయించిన తరువాత టమాట ముక్కలు వేసి కలపాలి. తరువాత 6 కప్పుల నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు వేయించిన గోధుమ రవ్వను కూడా వేసి కలపాలి. ఇప్పుడు కుక్కర్ పై మూత పెట్టి మధ్యస్థ మంటపై 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మూత తీసి కొత్తిమీర, నిమ్మరసం వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోధుమ రవ్వ కిచిడీ తయారవుతుంది. దీనిని అల్పాహారంగా లేదా రాత్రి సమయంలో భోజనంగా కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా గోధుమ రవ్వతో కిచిడీని తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.