ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో కేవలం రెండు ఫోన్లకు చెందిన కంపెనీలే రాజ్యమేలుతున్నాయి. ఒకటి గూగుల్.. మరొకటి యాపిల్.. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా మనకు ఆ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే యాపిల్‌కు చెందిన ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఐఫోన్లు కూడా మనకు లభిస్తున్నాయి. అయితే సహజంగానే ఆండ్రాయిడ్ కన్నా ఐఫోన్లు ఖరీదు ఎక్కువ ఉంటాయి. మరి రెండూ ఫోన్లే కదా.. ఈ రెండింటిలో కేవలం ఐఫోన్లకే ఎందుకంత క్రేజ్ ఉంటుంది ? జనాలు ఐఫోన్లను వాడేందుకే ఎందుకంత ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు ? అంటే…
ఐఫోన్లంటే జనాలకు క్రేజ్ ఉండడం వెనుక అనేక కారణాలున్నప్పటికీ వాటిల్లో ఉన్న ముఖ్య కారణాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1. సెక్యూరిటీ
ఆండ్రాయిడ్ ఫోన్ల కన్నా ఐఫోన్లే ఎక్కువ సురక్షితంగా ఉంటాయి. ఆండ్రాయిడ్ ఫోన్లను చాలా సులభంగా హ్యాకింగ్ చేయవచ్చు. కానీ ఐఫోన్లను హ్యాకింగ్ చేయడం అంత తేలికేం కాదు. అందువల్ల ఐఫోన్లలో డేటా కూడా సురక్షితంగానే ఉంటుంది. అలాగే ఒకవేళ ఐఫోన్‌ను ఎవరైనా పోగొట్టుకున్నా సరే.. దాన్ని ఫైండ్ మై ఐఫోన్ సహాయంతో చాలా సులభంగా వెదికి పట్టుకోవచ్చు. అందువల్లే ఈ ఫోన్లను వాడేందుకు జనాలు ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు.
2. యాప్ స్టోర్
ఆండ్రాయిడ్ లో గూగుల్ ప్లే స్టోర్ కన్నా.. యాపిల్ యాప్ స్టోర్ లోనే సురక్షితమైన యాప్‌లు ఎక్కువగా ఉంటాయి. యాపిల్ తన వినియోగదారుల భద్రతకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంది. అందుకని తమ యాప్ స్టోర్‌లో కొత్తగా చేరే యాప్‌లను చాలా క్షుణ్ణంగా ఆ కంపెనీ పరిశీలిస్తుంది. ఆ యాప్‌లు తమ కస్టమర్లకు సురక్షితమైన సేవలు అందిస్తాయని భావిస్తేనే యాపిల్ ఏ యాప్‌నైనా తమ యాప్ స్టోర్‌లో చేరుస్తుంది. లేకపోతే నిర్దాక్షిణ్యంగా ఆ యాప్‌ను తొలగిస్తుంది. అందువల్ల పూర్తిగా సురక్షితమైన యాప్‌లే ఎక్కువగా యాపిల్ యాప్ స్టోర్‌లో ఉంటాయి. ఈ కారణం చేత కూడా చాలా మంది ఐఫోన్లను కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.
3. డిస్ప్లే, టచ్ ఇంటర్ ఫేస్
ఆండ్రాయిడ్ ఫోన్ల కన్నా ఐఫోన్ల డిస్ప్లే మరింత నాణ్యంగా ఉంటుంది. చాలా నాణ్యమైన మెటీరియల్‌తో ఐఫోన్ డిస్ప్లేలను తయారు చేస్తారు. అందుకని అవి ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. అలాగే యూజర్లకు అద్భుతమైన కలర్లను తెరపై ప్రదర్శిస్తాయి. ఇక ఐఫోన్ డిస్ప్లే టచ్ కూడా చాలా స్మూత్‌గా ఉంటుంది. సున్నితంగా టచ్ చేసినా ఐఫోన్ డిస్ ప్లే చాలా వేగంగా స్పందిస్తుంది. వేగవంతమైన యాక్షన్ ఉంటుంది. దీంతో ఐఫోన్‌ను చాలా వేగంగా ఆపరేట్ చేసుకోవచ్చు. కానీ ఆండ్రాయిడ్ ఫోన్ల టచ్ కొద్దిగా హార్డ్ అనిపిస్తుంది. అలాగే ఐఫోన్లతో పోలిస్తే ఆండ్రాయిడ్ ఫోన్ల టచ్ అంత వేగవంతమైన రెస్పాన్స్ ఇవ్వదు. ఇక ఐఫోన్లలో ఉండే 3డీ టచ్ ఫీచర్ అద్భుతంగా పనిచేస్తుంది. యాప్‌లోకి వెళ్లకుండానే మనకు కావల్సిన పనిని 3డీ టచ్ ద్వారా చేసుకోవచ్చు. అందుకనే చాలా మంది ఐఫోన్లను కొంటుంటారు.
4. ఆపరేటింగ్ సిస్టమ్
ఆండ్రాయిడ్ కన్నా ఐఫోన్లో ఉండే ఐఓఎస్ సమర్థవంతంగా పనిచేస్తుంది. అయితే ఆండ్రాయిడ్ మాదిరిగా ఐఓఎస్ యూజర్ ఫ్రెండ్లీ కాకపోయినా.. ఓఎస్ మాత్రం చాలా స్మూత్‌గా ఉంటుంది. ఏ యాప్‌నైనా, గేమ్‌నైనా చాలా వేగంగా ఓపెన్ చేయవచ్చు. అలాగే యాప్‌ల మధ్య చాలా వేగంగా మారవచ్చు. జనాలు ఐఫోన్లను కొనేందుకు ఆసక్తిని చూపించడంలో ఉన్న కారణాల్లో ఇది కూడా ఒకటి.
5. సాఫ్ట్వేర్ అప్డేట్స్
సాధారణంగా ఆండ్రాయిడ్ ఫోన్లకు ఆయా కంపెనీలు 1, 2 ఏళ్లకు మించి అప్డేట్లను ఇవ్వవు. ఇక కొన్ని కంపెనీలు అయితే అసలు అప్డేట్లనే రిలీజ్ చేయవు. కానీ యాపిల్ అలా కాదు. దాదాపుగా నెలకొకసారి అప్డేట్లను పంపిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఒక్కసారి ఐఫోన్‌ను కొంటే దాదాపుగా 4 నుంచి 6 సంవత్సరాల వరకు యాపిల్ నుంచి ఐఓఎస్ అప్డేట్లను పొందవచ్చు. దీంతో ఫోన్ మరింత సురక్షితంగా ఉండడమే కాదు, చాలా స్మూత్‌గా, వేగంగా కూడా పనిచేస్తుంది. అందుకనే ఐఫోన్లను కొనేందుకు చాలా మంది యూజర్లు ఇష్టాన్ని ప్రదర్శిస్తుంటారు.
6. కెమెరా
ఆండ్రాయిడ్ ఫోన్ల కన్నా.. యాపిల్‌కు చెందిన ఐఫోన్ కెమెరాలతో తీసే ఫోటోలే ఎక్కువ నాణ్యంగా ఉంటాయి. ఐఫోన్ కెమెరా యాప్‌లో అనేక ఆప్షన్లు మనకు దర్శనమిస్తాయి. ఐఫోన్‌తో తీసే ఫొటోలు, వీడియోలు నాణ్యంగా ఉంటాయనే కారణంతోనూ చాలా మంది ఈ ఫోన్లను కొనేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు.
పైన చెప్పిన 6 మాత్రమే కాక.. జనాలు ఐఫోన్లను ఎక్కువగా కొనేందుకు పలు ఇతర కారణాలు కూడా ఉన్నాయి. కొందరు ధర ఎక్కువ ఉంటుందని చెప్పి, ప్రెస్టీజ్ ఇష్యూ అని చెప్పి ఖరీదైన ఫోన్లను వాడుతున్నామనే డాబు చూపించుకోవడం కోసం ఐఫోన్లను కొంటారు. ఇక కొందరు జీవితంలో ఒక్కసారైనా యాపిల్ ఫోన్ వాడాలనే కోరికతో ఐఫోన్లను కొంటారు. మరికొందరు గేమ్స్ కోసం, ఇంకొందరు ఎంటర్టైన్మెంట్ కోసం, పలువురు కాల్ క్వాలిటీ కోసం.. ఐఫోన్లను కొంటారు. ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారైతే యాప్‌లను టెస్ట్ చేసేందుకు కూడా ఐఫోన్లను కొంటారు. ఏది ఏమైనా.. ఏటా కొత్తగా ఏ ఐఫోన్ రిలీజ్ అయినా.. అవి జనాలను విపరీతంగా ఆకట్టుకుంటూనే ఉన్నాయి. అదీ.. యాపిల్ ఐఫోన్లో ఉన్న గమ్మత్తు..!