Aloe Vera Farming : ఆలోచన ఉండాలే కానీ సంపాదించే మార్గం అదే వస్తుంది. దానికి కాస్త శ్రమను జోడిస్తే చాలు.. ఆదాయం అదే వస్తుంది. ఇలా ఎంతో మంది ఎన్నో ఉపాధి మార్గాలను పొందుతూ లక్షల రూపాయలను సంపాదిస్తున్నారు. అలాగే అతను కూడా మొదట్లో ఆందోళన చెందాడు. కానీ ఇప్పుడు ఏడాది లక్షల రూపాయల టర్నోవర్ సాధిస్తున్నాడు. అతను ఒకప్పుడు టీ అమ్మేవాడు. కానీ ఇప్పుడు కలబంద పంటను సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నాడు. అతనే రాజస్థాన్‌కు చెందిన అజయ్ స్వామి.
అజయ్ స్వామికి తండ్రి నుంచి సంక్రమించిన 0.66 ఎకరాల భూమి ఉంది. కానీ దాన్ని అతను ఉపయోగించేవాడు కాదు. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలు మీద పడ్డాయి. దీంతో అతను టీ అమ్ముతూ కుటుంబాన్ని పోషించ సాగాడు. రాజస్థాన్ లోని హనుమాన్ గడ్ జిల్లా పర్లిక అనే గ్రామంలో అతను నివాసం ఉంటున్నాడు. అయితే ఒక రోజు అతను పేపర్లో కలబంద సాగుపై వచ్చిన కథనాన్ని చదివాడు. దీంతో తనకు ఉన్న భూమిలో కలబందను సాగు చేయాలని అనుకున్నాడు. వెంటనే తన గ్రామంలో శ్మశాన వాటికతోపాటు అక్కడక్కడా ఉన్న కలబంద మొక్కలను సేకరించి తన పొలంలో మళ్లీ వాటిని నాటాడు.
అయితే కలబంద మొక్కలను అయితే నాటాడు. కానీ మరోవైపు పంట చేతికి వస్తుందా.. లేదా.. అని టీ వ్యాపారాన్ని కొనసాగించాడు. కానీ సంవత్సరం తిరిగే లోపు పంట వచ్చింది. అయితే వచ్చిన పంటను అమ్మడం ఎలా అని పరిశోధించాడు. కలబందను జ్యూస్ చేసి అమ్మితే బాగా లాభాలు ఉంటాయని తెలుసుకుని కాస్త అప్పు చేసి అందుకు కావల్సిన యంత్రాలను కొని జ్యూస్ తీసి అమ్మాడు. దీంతో లాభాలు వచ్చాయి. ఇక అప్పటి నుంచి అజయ్ స్వామి వెను తిరిగి చూడలేదు. కలబంద సాగునే జీవన మార్గంగా మలచుకుని లాభాలను గడించసాగాడు.
అలా అతను 2012లో తాను చేస్తున్న టీ వ్యాపారానికి స్వస్తి చెప్పి పూర్తి స్థాయిలో కలబందను పండించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే సొంత ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి కలబంద ఉత్పత్తులను తన ఫ్యాక్టరీలోనే తయారు చేసి విక్రయించడం మొదలు పెట్టాడు. సబ్బులు, షాంపూలతోపాటు, జ్యూస్, ఆహార ఉత్పత్తులను కూడా చేసి అమ్మసాగాడు. దీంతో లాభాలు వచ్చాయి. అలా అజయ్ స్వామి తన భూమిలో కలబంద సాగు చేస్తూ ఏడాదికి రూ.10 లక్షలకు పైగానే సంపాదిస్తున్నాడు. ఇది చాలా లాభసాటిగా ఉందని చెబుతున్నాడు.
కలబందను సాగు చేసేందుకు నీళ్లు కూడా ఎక్కువగా అవసరం ఉండవని అంటున్నాడు. పంట 6 నుంచి 12 నెలల్లో చేతికి వస్తుంది. సొంతంగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తే ప్రాసెసింగ్ చేసి వివిధ రకాల అలొవెరా ఉత్పత్తులను సొంతంగా విక్రయించవచ్చు. అలా చేసిన ఉత్పత్తులను అనేక కంపెనీలు తన నుంచి కొంటున్నాయని అజయ్ స్వామి తెలియజేశాడు. ఇక అర ఎకరం స్థలంలో సుమారుగా 1500 వరకు మొక్కలను పెంచి మంచి లాభాలను పొందవచ్చని చెబుతున్నాడు. నిజంగా ఇలా చేస్తే ఎవరైనా లాభాలను పొందవచ్చని అంటున్నాడు.