దొండకాయ చాలా రుచిగా ఉంటుంది. చలువనిస్తుంది. రక్తస్రావం అయ్యే జబ్బుల్లో తప్పనిసరిగా తినదగిన ఔషధం. పురుషుల్లో లైంగిక శక్తిని పెంచుతుంది. దీనికి లేఖనం (జిడ్డును తొలగించే) గుణం ఉంది. అంటే రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. గుండె జబ్బులు ఉన్నవారు, బీపీ, మధుమేహం వ్యాధులు ఉన్నవారికి మేలు చేస్తుంది. అతిగా తింటే విరేచనాన్ని బంధిస్తుంది. ఉబ్బరాన్ని కలిగిస్తుంది. చింతపండు, అల్లం, వెల్లుల్లి మసాలాలు లేకుండా దొండకాయల్ని వండుకుంటే ఉబ్బరం లాంటి వ్యాధులు కలగకుండా ఉంటాయి.
వంకాయలతో బజ్జీ పెరుగు పచ్చడి చేసుకున్నట్లే లేత దొండకాయలతోనూ చేసుకోవచ్చు. దొండకాయల తల, తోక భాగాలు తరిగి, నూనె లేదా నెయ్యి పట్టించి ఈ దొండకాయలను నిప్పుల మీద లేదా గ్రిల్ సహాయంతో గ్యాస్ స్టవ్ మీద ఉంచి, మరీ నల్లగా మాడకుండా లోపలి భాగం సమంగా ఉడికేలా తిప్పుతూ కాల్చండి. ఉడికిన తరువాత మెత్తగా నూరి, పెరుగులో ఉంచి తగినంత ఉప్పు, కొత్తిమీర, ఆవపిండి కలిపి ఇంగువ తాళింపు పెట్టిన కమ్మని పెరుగు పచ్చడి జీర్ణశక్తిని పెంచుతుంది.
ఇలా వండి తింటే అమీబియాసిస్ లాంటి వ్యాధులు, అల్సర్లు తగ్గుతాయి. నిప్పుల మీద కాల్చే అవసరం లేకుండా దొండకాయ ముక్కల్ని ఉప్పు కలిపిన నీటిలో ఉడికించి పెరుగులో కలిపి కొద్దిగా ఆవపిండి, కొత్తిమీర చేర్చి ఇంగువ తాళింపు పెట్టిన పెరుగు పచ్చడి కూడా కమ్మగానే ఉంటుంది. పై గుణాలనే కలిగి ఉంటుంది. దొండకాయ కూరకు నెయ్యి, ఇంగువ, పెరుగు.. ఈ మూడూ ఆరోగ్యదాయక సహచరులుగా పనిచేస్తాయి.