Vitamin B9 : సాధారణంగా గర్భిణీలకు ఫోలిక్ యాసిడ్ (విటమిన్ బి9) ఎక్కువగా ఉన్న ఆహారాలను తినమని వైద్యులు చెబుతుంటారు. ఎందుకంటే.. ఫోలిక్ యాసిడ్ వల్ల కడుపులో ఉన్న బిడ్డ ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. పుట్టుక లోపాలు తలెత్తకుండా ఉంటాయి. అలాగే బిడ్డ పుట్టాక ఆరోగ్యంగా కూడా ఉంటుంది. అందుకనే డాక్టర్లు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లను కూడా గర్భిణీలకు ఇస్తుంటారు. అయితే నిజానికి ఫోలిక్ యాసిడ్ గర్భిణీలకే కాదు.. అందరికీ అవసరమే. దాంతో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫోలిక్ యాసిడ్ ఉన్న ఆహారాలను నిత్యం తీసుకున్నా లేదా ఆ విటమిన్ ట్యాబ్లెట్లను వేసుకున్నా క్యాన్సర్లు రాకుండా ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. పెద్దపేగు, గర్భాశయ, క్లోమ గ్రంథి క్యాన్సర్లు రాకుండా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. వయస్సు మీద పడడం వల్ల సాధారణంగా వృద్ధులకు మతిమరుపు, అల్జీమర్స్ వంటి వ్యాధులు వస్తుంటాయి. అయితే నిత్యం ఫోలిక్ యాసిడ్ ఉన్న ఆహారాలను తీసుకోవడం ద్వారా వృద్ధాప్యంలో వచ్చే ఆయా వ్యాధులను అడ్డుకోవచ్చు. దీంతోపాటు వృద్ధుల్లో జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.
మన శరీరంలో రక్త కణాలు తయారు కావాలంటే ఐరన్‌తోపాటు ఫోలిక్ యాసిడ్ కూడా అవసరమే. దీన్ని నిత్యం తీసుకోవడం వల్ల రక్తం బాగా తయారవుతుంది. దీంతో అనీమియా (రక్తహీనత) సమస్య నుంచి బయట పడవచ్చు. సాధారణంగా స్త్రీలకు నెలసరి సమయంలో రక్తస్రావం, నొప్పి ఉంటాయి. అయితే కొందరిలో ఈ సమస్యలు మరింత ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల ఆయా సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.