గర్భం దాల్చిన మహిళలకు సాధారణంగానే డాక్టర్లు ఫోలిక్ యాసిడ్ మాత్రలను వేసుకోవాలని చెబుతుంటారు. అందుకు అనుగుణంగా మందులను రాసిస్తుంటారు. అయితే కేవలం గర్బధారణ సమయంలోనే కాదు మహిళలకు ఫోలిక్ యాసిడ్ ఇతర సమయాల్లోనూ అవసరమే. రక్తహీనతను తగ్గించడానికి ఐరన్ అవసరం అవుతుంది. ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉండేందుకు కాల్షియం కావాలి. అలాగే కణాల నిర్మాణానికి, ఎర్ర రక్త కణాల తయారీకి ఫోలిక్ యాసిడ్ అవసరం అవుతుంది. దీన్ని శరీరం తనంతట తానుగా తయారు చేసుకోలేదు. కనుక మనం ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లు వేసుకోవాలి. లేదా ఫోలేట్ ఉండే ఆహారాలను తినాలి.
ఫోలిక్ యాసిడ్ వల్ల మహిళల్లో నెలసరి సరిగ్గా ఉంటుంది. గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఎదురు కావు. బిడ్డకు జన్మనివ్వడం, వారికి పాలివ్వడం సజావుగా సాగుతాయి. శరీరానికి శక్తి లభిస్తుంది. జీర్ణాశయ సంబంధ కణజాల నిర్మాణానికి ఫోలేట్ అవసరం. వెన్నెముక దృఢత్వానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. పిల్లల్లో ఫోలిక్ యాసిడ్ లోపం ఉంటే రక్తహీనత సమస్య వస్తుంది. దీంతో వారిలో శారీరక ఎదుగుదల మందగిస్తుంది. అలాగే యుక్త వయస్సు వచ్చిన బాలికల్లో నెలసరి ప్రారంభం అయ్యాక ఫోలిక్ యాసిడ్ లోపం ఏర్పడితే గర్భధారణ సమస్యలు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి.
ఇక బాలింతలు, 30 ఏళ్లు దాటిన స్త్రీలలో ఈ లోపం వస్తే వారిలో ఎముకలు బలహీనంగా మారుతాయి. పెళుసుగా మారి విరిగే అవకాశం ఉంటుంది. గుండె జబ్బులు వస్తాయి. జుట్టు రాలడం జరుగుతుంది. ఫోలిక్ యాసిడ్ లోపం ఉంటే ఆకలి సరిగ్గా వేయదు. ముఖం పాలిపోయి కనిపిస్తుంది. బరువు త్వరగా తగ్గుతారు. త్వరగా అలసిపోతారు. నీరసంగా అనిపిస్తుంటుంది. బద్దకంగా ఉంటుంది.
గర్భధారణ జరిగాక తల్లులకు ఫోలిక్ యాసిడ్ మాత్రలను వాడాల్సిందిగా డాక్టర్లు సూచిస్తుంటారు. దీంతో గర్భస్థ శిశువుకు పోషణ లభిస్తుంది. ఆ సమయంలో శిశువు ఎదుగుదలలో కొన్ని కీలకమైన మార్పులు చోటు చేసుకుంటాయి. వెన్నెముక, నరాలు ఏర్పడే ఆ దశలో తగినంత ఫోలిక్ యాసిడ్ అందకపోతే వెన్నెముకకు సంబంధించిన న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అంటే బిడ్డ వెన్ను సరిగ్గా అభివృద్ధి చెందదన్నమాట. దీంతోపాటు శిశువు డీఎన్ఏ, ఆర్ఎన్ఏ రూపకల్పనలో, పిల్లల్లో ఆటిజం వంటి సమస్యలు రాకుండా చూడడంలో ఫోలేట్‌లు ఎంతో కీలకం. అందుకే గర్భం ధరించింది మొదలు ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. దీంతోపాటు డాక్టర్లు సూచించిన విధంగా మందులను వాడాలి.
మొదటి 12 వారాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తగినంత ఫోలిక్ యాసిడ్ లేకపోతే నెలలు నిండకుండానే ప్రసవం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు అవాంఛిత గర్భస్రావాలు జరగడానికి ఆస్కారం ఉంది. ఒక వేళ ఏ సమస్యల్లేకుండా ప్రసవమైనా పిల్లలు తగినంత బరువుతో పుట్టరు.
వయస్సు మీద పడుతున్న వారికి సహజంగానే మతిమరుపు వస్తుంటుంది. కంటి చూపు తగ్గుతుంది. కానీ ఫోలేట్ ఉన్న ఆహారాలను తీసుకుంటే ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు. వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు. మహిళ్లలో గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలను ఫోలేట్ తగ్గిస్తుంది. ఆస్టియో పోరోసిస్ (ఎముకలు గుల్ల బారడం), నిద్రలేమి, గుండె జబ్బులు రాకుండా అడ్డుకోవచ్చు.
పురుషులతో పోలిస్తే మహిళలకు ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా అవసరం ఉంటుంది. అందుకని 11 ఏళ్లు దాటినప్పటి నుంచి అమ్మాయిలు ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. గర్భం దాల్చిన మహిళలకు రోజుకు 400 మైక్రో గ్రాముల వరకు ఫోలిక్ యాసిడ్ అవసరం అవుతుంది. గర్భం దాల్చిన తొలి 12 వారాల వరకు మహిళలు రోజుకు 500 మైక్రో గ్రాముల వరకు ఫోలిక్ యాసిడ్‌ను తీసుకోవాలి. పాలిచ్చే తల్లులకు రోజుకు 300 మైక్రో గ్రాముల వరకు ఫోలిక్ యాసిడ్ సరిపోతుంది. అయితే గర్భంతో ఉన్నవారు కాక మిగిలిన వారు ఫోలిక్ యాసిడ్‌ను మాత్రల రూపంలో కాక, అది లభించే ఆహారాలను తీసుకోవడం మంచిది.
ఆకు కూరల్లో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఒక కప్పు పాలకూరలో అత్యధికంగా 260 మైక్రోగ్రాముల వరకు ఫోలిక్ యాసిడ్ లభిస్తుంది. అలాగే తోటకూర, చుక్కకూరల్లోనూ ఇది లభిస్తుంది. అయితే ఈ ఆకుకూరలను మరీ ఎక్కువగా ఉడికించరాదు. ఉడికిస్తే ఫోలిక్ యాసిడ్‌ను నష్టపోతాం. కనుక తక్కువ సమయం పాటు ఉడికించి తీసుకోవాలి. బీన్స్, చిక్కుడు జాతి గింజలు, పప్పు ధాన్యాల్లోనూ ఫోలేట్ అధికంగా ఉంటుంది. ఒక కప్పు బీన్స్ ను తీసుకుంటే 180 మైక్రోగ్రాముల వరకు ఫోలిక్ యాసిడ్ లభిస్తుంది. ఇది నీటిలో కరిగే బి కాంప్లెక్స్ విటమిన్. కనుక చిక్కుడు వంటి గింజలను వేయించకుండా ఉడికించి తీసుకుంటే మంచిది.
నిమ్మజాతి పండ్లలో ఫోలేట్ అధికంగా ఉంటుంది. ఒక కప్పు నారింజ పండు రసాన్ని తాగితే ఒక రోజుకు అవసరమైన ఫోలిక్ యాసిడ్‌లో 5వ వంతు లభిస్తుంది. టమాటా రసం ద్వారా కూడా ఫోలిక్ యాసిడ్ అందుతుంది. మాంసాహారం తినేవారు లివర్‌ను తీసుకోవాలి. అందులో విటమిన్ బి9 రూపంలో ఫోలిక్ యాసిడ్ లభిస్తుంది. హోల్ వీట్ బ్రెడ్‌ను కూడా తీసుకోవచ్చు.
పొద్దు తిరుగుడు విత్తనాలు, వేరుశెనగలు, పుట్ట గొడుగులు, బొప్పాయి, క్యారెట్, బీట్ రూట్, పచ్చి బఠానీ, చేపలు, పాలు, బ్రౌన్ రైస్, అరటి పండ్లు, మొక్క జొన్న, పైనాపిల్, క్యాబేజీ, బంగాళాదుంపలు, చిలగడ దుంపలు, గోధుమల్లో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. వీటిని రోజూ తీసుకోవడం వల్ల ఫోలిక్ యాసిడ్ లోపం రాకుండా చూసుకోవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365