మనకు అనేక రకాల విటమిన్లు అవసరం అవుతాయన్న సంగతి తెలిసిందే. అయితే ఆ విటమిన్లలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి, నీటిలో కరిగే విటమిన్లు. రెండు, కొవ్వులో కరిగే విటమిన్లు. మనం తినే ఆహారాల నుంచి శరీరం ఆ విటమిన్లను గ్రహిస్తుంది. నీటిలో కరిగే విటమిన్లను శోషించుకుంటుంది. అదనంగా ఉంటే వాటిని వ్యర్థాల రూపంలో బయటకు పంపుతుంది. ఇక కొవ్వులో కరిగే విటమిన్లను శోషించుకున్నాక అదనంగా ఉన్న ఆ విటమన్లను శరీరం లివర్‌లో నిల్వ చేస్తుంది. కొవ్వులో కరిగే విటమిన్లు కొవ్వు కణజాలాల్లో కూడా నిల్వ ఉంటాయి. అవి అదనంగా ఉన్నా వాటిని శరీరం బయటకు పంపదు. నిల్వ చేసుకుంటుంది. కేవలం నీటిలో కరిగే విటమిన్లను మాత్రమే అవసరమైనంత మేర తీసుకున్నాక అదనంగా ఉన్న వాటిని వ్యర్థాల రూపంలో బయటకు పంపుతుంది. ఇక ఈ రెండు రకాల విటమిన్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కొవ్వులో కరిగే విటమిన్లు
విటమిన్లు ఎ, డి, ఇ, కె లు కొవ్వులో కరిగే విటమిన్లు. అంటే మనం తినే ఆహారాల్లో ఉండే ఈ విటమిన్లను శరీరం కొవ్వులో కరిగించుకుని గ్రహిస్తుంది. దీంతో ఈ విటమిన్లు మనకు లభిస్తాయి. ఇవి అదనంగా ఉంటే లివర్, కొవ్వు కణజాలాల్లో నిల్వ అవుతాయి. తరువాత వాటిని శరీరం పలు రకాల పనులకు ఉపయోగించుకుంటుంది.
కొవ్వులో కరిగే ఆయా విటమిన్ల వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. విటమిన్ ఎ కంటి చూపుకు, గుండె ఆరోగ్యానికి పనిచేస్తుంది. విటమిన్ డి రోగ నిరోధక శక్తి, ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. విటమిన్ ఇ కూడా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. పురుషుల్లో నపుంసకత్వ సమస్యను తగ్గిస్తుంది. శిరోజాలు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇక విటమిన్ కె గాయాలు అయినప్పుడు రక్త స్రావం అధికంగా కాకుండా ఉండేందుకు రక్తాన్ని త్వరగా గడ్డ కట్టేలా చేస్తుంది. అందువల్ల ఈ విటమిన్లు మనకు రోజూ అవసరమే. మన శరీరంలో కొవ్వు ఉంటేనే ఈ విటమిన్లను శరీరం ఆహారం నుంచి శోషించుకుంటుంది. అందువల్లే ఆరోగ్యకరమైన కొవ్వులను రోజూ తినాలని వైద్యులు చెబుతుంటారు. నట్స్, చేపలు వంటి వాటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయి.
నీటిలో కరిగే విటమిన్లు
బి విటమిన్లతోపాటు సి విటమిన్ నీటిలో కరుగుతాయి. వీటిని శరీరం శోషించుకోవాలంటే శరీరంలో కొవ్వు ఉండాల్సిన పనిలేదు. వీటిని శరీరం రోజూ గ్రహిస్తుంది. అందువల్ల వీటిని రోజూ తీసుకోవాలి.
అయితే కొవ్వులో కరిగే విటమిన్లను రోజూ తీసుకోవాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు ఆ విటమిన్లు అందేలా చూసుకుంటే చాలు. వాటిని ఎలాగూ శరీరం నిల్వ చేసుకుంటుంది. కనుక వాటిని రోజూ అందేలా చూసుకోవాల్సిన పనిలేదు. కానీ విటమిన్లు బి, సిలను రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.
కొవ్వులో కరిగే విటమిన్లలో ఒకటైన విటమిన్ ఎ మనకు గుమ్మడికాయలు, యాపిల్స్, క్యారెట్లు, చిలగడ దుంపలు, టమాటాలు, పాలకూర, చీజ్, వెన్న, కోడిగుడ్డులోని పచ్చని సొనలో లభిస్తుంది.
ఇక విటమిన్ డి మనకు సూర్యరశ్మి ద్వారా లభిస్తుంది. రోజూ ఉదయాన్నే 20 నిమిషాల పాటు శరీరానికి ఎండ బాగా తగిలేలా ఉంటే చాలు, మన శరీరం విటమిన్ డి ని తయారు చేసుకుంటుంది. అలాగే చేపలు, పుట్ట గొడుగులు, పాలలోనూ ఈ విటమిన్ మనకు లభిస్తుంది.
విటమిన్ ఇ ఎక్కువగా పొద్దు తిరుగుడు విత్తనాలు, గుమ్మడికాయ విత్తనాలు, అవిసె గింజలు, నట్స్, వెజిటబుల్ ఆయిల్స్ లలో లభిస్తుంది.
విటమిన్ కె ఎక్కువగా కొత్తిమీర, పాలకూర, మొలకెత్తిన విత్తనాలు, కోడిగుడ్డులోని పచ్చని సొన, పులిసిన ఆహారాలు, సోయాబీన్స్‌లో లభిస్తుంది. అందువల్ల ఆయా ఆహారాలను తరచూ తీసుకుంటే ఆయా విటమిన్ల లోపం తలెత్తకుండా చూసుకోవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365