Vitamin D : మన శరీరానికి అవసరమైన విటమిన్స్ లో విటమిన్ డి ఒకటి. సూర్యరశ్మి ద్వారా మన శరీరం విటమిన్ డి ని తయారు చేసుకుంటుంది. ఈ మధ్య కాలంలో చాలా మందిలో విటమిన్ డి లోపం కనిపిస్తోంది. శరీరానికి సూర్య రశ్మి తగలక పోవడం వల్ల విటమిన్ డి లోపం వస్తోంది. ఆహార పదార్థాల ద్వారా విటమిన్స్ మన శరీరానికి అందుతాయి. విటమిన్ డి ఆహార పదార్థాల ద్వారా ఎందుకు అందదు.. అనే సందేహం కూడా చాలా మందికి కలుగుతుంది. ఆహార పదార్థాలలో కూడా విటమిన్ డి ఉంటుంది, కానీ చాలా తక్కువ మోతాదులో మాత్రమే ఉంటుంది.
ఆహార పదార్థాలలో ఉండే విటమిన్ డి మన శరీరానికి సరిపోదు. ఈ విటమిన్ ఆహార పదార్థాలలో నేరుగా విటమిన్ డి రూపంలో ఉండదు. వృక్ష సంబంధితమైన ఆహారాలలో విటమిన్ డి2 రూపంలో ఈ విటమిన్ ఉంటుంది. వృక్ష సంబంధిత ఆహారాలను మన ఆహారంలో భాగంగా తీసుకున్నపుడు డి2 రూపంలో ఉండే ఈ విటమిన్.. డి విటమిన్ గా మన శరీరంలో మారుతుంది. ఈ ప్రక్రియ మన శరీరంలోని కాలేయంలో జరుగుతుంది. మన శరీరానికి రోజుకు 7-10 మైక్రో గ్రాముల విటమిన్ డి అవసరమవుతుంది. మనం ఆహారం ద్వారా విటమిన్ డి2 ను తీసుకున్నప్పుడు విటమిన్ డి గా మారే ప్రక్రియలో మరి కొంత పరిమాణాన్ని కోల్పోతుంది.
మనం 50 మైక్రో గ్రాముల విటమిన్ డి2 ను ఆహారం ద్వారా తీసుకున్నప్పుడు 7- 10 మైక్రో గ్రాముల విటమిన్ డి మాత్రమే మన శరీరానికి అందుతుంది. మనం అధిక కొవ్వులు, అల్సర్ లను కలిగించే ఆహారాలను తీసుకోవడం వల్ల మన జీర్ణాశయంలో ఉండే ప్రేగులకు హాని కలుగతుంది. దీని వల్ల ప్రేగులు మనం తినే ఆహారాలలో ఉండే విటమిన్ డి2 ను సంగ్రహించుకునే శక్తిని కోల్పోతాయి. దీని వల్ల మనలో విటమిన్ డి లోపం వస్తుంది. ఈ లోపం నుండి బయట పడడానికి మనం విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవాలి.
మన శరీరానికి హాని కలిగించని, విటమిన్ డి ఉన్న ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విటమిన్ డి.. బేబీ కార్న్, రాగులు, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు, తోటకూర విత్తనాలు, వాల్ నట్స్, సోయా బీన్స్, పుట్ట గొడుగులలో కొద్దిగా ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. 100 గ్రాముల పరిమాణంలో ఈ ఆహార పదార్థాలను ఆహారంగా తీసుకున్నప్పుడు 7 – 10 మైక్రో గ్రాముల విటమిన్ డి మాత్రమే మన శరీరానికి అందుతుంది. మిగిలిన ఆహార పదార్థాలలో విటమిన్ డి ఇంకా తక్కువ పరిమాణంలో ఉంటుంది. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సినంత విటమిన్ డి అందుతుంది. విటమిన్ డి లోపం రాకుండా ఉంటుంది. ఈ ఆహారాలను వారంలో కనీసం 2 సార్లు అధిక మొత్తంలో తీసుకున్నా చాలు.. మనకు కావల్సినంత విటమిన్ డి లభిస్తుంది.