మన శరీరానికి కావల్సిన అనేక రకాల విటమిన్లలో విటమిన్ ఇ కూడా ఒకటి. ఇవి కొవ్వులో కరిగే విటమిన్. అంటే.. మనం తినే ఆహార పదార్థాల్లోని కొవ్వును ఉపయోగించుకుని శరీరం ఈ విటమిన్‌ను శోషించుకుంటుంది. విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది సహజంగా అనేక పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు, గోధుమలు, బాదం, అవోకాడోలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, సాల్మన్ చేపలు, మామిడి పండ్లు, కివీలు, పాలకూర, క్యాప్సికమ్ వంటి వాటి ద్వారా లభిస్తుంది.
విటమిన్ ఇ చిన్న మొత్తాలలో అవసరం అయినప్పటికీ శరీరంలో అనేక శరీర విధులను నిర్వహించడానికి అవసరం అవుతుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. అనేక వ్యాధులను రాకుండా చూస్తుంది. విటమిన్ ఇ వల్ల అల్జీమర్స్ వచ్చే అవకాశాలను తగ్గించవచ్చు. ఇది మూత్రపిండాల పనితీరును ప్రోత్సహిస్తుంది. అథెరోస్క్లెరోసిస్, ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ వంటి జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది. ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ లక్షణాలను నివారించడానికి సహాయపడుతుంది. కాగ్నిటివ్ ఫంక్షన్లను నిర్వహిస్తుంది. నరాల నష్టాన్ని నివారిస్తుంది. మంచి దృష్టిని అందిస్తుంది. కండరాలను బలోపేతం చేస్తుంది.
విటమిన్ ఇ పురుషులలో సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుంది. చర్మం, జుట్టుకు మేలు చేస్తుంది. కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది.
విటమిన్ ఇ లోపం వల్ల మెదడు, నరాలు, వెన్నెముక, కండరాలు పనిచేయకపోవడం వంటి సమస్యలు వస్తాయి. కండరాల నొప్పి, బలహీనత, కార్డియోమయోపతి లేదా గుండె కండరాల వ్యాధి, కండరాల క్షీణత, నవజాత శిశువులు తక్కువ బరువుతో పుట్టడం, కళ్లను పైకి కిందికి కదిలించడంలో ఇబ్బంది, హైపోర్‌ఫ్లెక్సియా లేదా కండరాల రిఫ్లెక్స్ ప్రతిస్పందన తగ్గడం, రాత్రి పూట దృష్టి లోపం (రేచీకటి), తిమ్మిరి లేదా జలదరింపు భావన వంటి సమస్యలు కూడా విటమిన్ ఇ లోపం వల్ల వస్తాయి. కనుక మన శరీరానికి విటమిన్ ఇ ని తరచూ అందేలా చూసుకుంటే ఆయా సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు.
విటమిన్ ఇ ఎవరెవరికి ఎంత కావాలంటే ? (రోజుకు అవసరం అయ్యేది)
- వయస్సు 0 నుండి 6 నెలల వరకు : 3 mg
- వయస్సు 6 నుండి 12 నెలల వరకు : 4 mg
- వయస్సు 1 నుండి 3 సంవత్సరాల వరకు : 6 mg
- వయస్సు 4 నుండి 10 సంవత్సరాల వరకు : 7 mg
- పెద్దలు, వృద్ధుకు : 10 mg
వైద్య పరిస్థితిని బట్టి విటమిన్ ఇ సప్లిమెంట్‌లను వాడవచ్చు. డాక్టర్‌ను సంప్రదించి వాటిని వాడుకోవాలి.
పొద్దుతిరుగుడు విత్తనాలు, సోయాబీన్స్, వేరుశెనగ, పాలకూర, మామిడి పండ్లు, బ్రోకలీ, బాదం పప్పుల్లో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. అందువల్ల వీటిని తరచూ తింటే విటమిన్ ఇ లోపం రాకుండా చూసుకోవచ్చు.