Sweet Lime : మనకు అందుబాటులో ఉండే అత్యంత చవకైన పండ్లలో బత్తాయి పండ్లు ఒకటి. ఇవి మనకు దాదాపుగా అన్ని సీజన్లలోనూ లభిస్తాయి. అయితే వేసవి సీజన్‌లో వీటిని ఎక్కువగా తింటుంటారు. ముఖ్యంగా వీటి నుంచి తీసే జ్యూస్‌ను ఈ సీజన్‌లో ఎక్కువగా తాగుతుంటారు. అయితే బత్తాయి పండ్ల వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
బత్తాయి పండ్లలో ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. అందువల్ల ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధులను రాకుండా చూస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అధిక బరువును తగ్గించేందుకు సహాయపడతాయి. ఈ పండ్లలో కాల్షియం అధికంగా ఉంటుంది. కనుక వీటి జ్యూస్‌ను తాగుతుంటే ఎముకలు, దంతాలు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి.
బత్తాయి పండ్లలో ఫాస్ఫరస్, ఐరన్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తహీనత సమస్య నుంచి బయట పడేస్తాయి. రక్తం ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. ఈ పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. హైబీపీని తగ్గిస్తుంది. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు.
ఈ పండ్ల రసాన్ని ఒక గ్లాస్ మోతాదులో తీసుకుని అందులో కొద్దిగా తేనె కలపాలి. అనంతరం ఈ జ్యూస్‌ను రాత్రి పూట తాగాలి. దీంతో మరుసటి రోజు సుఖ విరేచనం అవుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది.
బత్తాయి పండ్ల రసాన్ని రోజూ తాగుతుంటే చర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది. చర్మ సమస్యలు తగ్గుతాయి. అలాగే శరీరంలోని వ్యర్థాలు బయటకు పోయి శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది.
బత్తాయి పండ్లను తింటున్నా లేదా వాటి రసాన్ని తాగుతున్నా.. ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి. దీంతో శ్వాస కోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ఆస్తమా, జలుబు తగ్గుతాయి.
కామెర్లు వచ్చిన వారు ఈ పండ్ల రసాన్ని రోజూ తాగుతుంటే త్వరగా కోలుకుంటారు. అలాగే నీరసం పోతుంది. బలం వస్తుంది. యాక్టివ్‌గా మారి చురుగ్గా పనిచేస్తారు. ఇక ఉదయం వ్యాయామం చేసిన అనంతరం ఒక గ్లాస్ బత్తాయి పండు రసాన్ని తాగితే పోయిన శక్తి వెంటనే తిరిగి వస్తుంది. దీంతో ఉత్సాహంగా మారుతారు. అలాగే ఈ రసాన్ని తాగితే కడుపులో మంట కూడా తగ్గుతుంది.