Guava Tree : మనం మన ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుకోవడానికి ఎంతో శ్రమిస్తాం. ఎన్నో ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ ఉంటాం. వాటిల్లో పండ్లను తినడం కూడా ఒకటి. మనం వివిధ రకాల పండ్లను ఆహారంగా తీసుకంటూ ఉంటాం. మనం ఆహారంగా తీసుకునే పండ్లల్లో జామ పండు కూడా ఒకటి. ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో జామపండు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ జామకాయలో అపరిమిత పోషకాలు ఉంటాయి. ఇవి మనకు దాదాపుగా అన్ని కాలాల్లో విరివిరిగా చవకగా లభిస్తాయి. జామకాయే కదా అని చాలా మంది తేలికగా తీసుకుంటారు. కానీ జామకాయను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.
జామపండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కమలా పండ్లలో కంటే 5 రెట్లు విటమిన్ సి వీటిలో ఎక్కువగా ఉంటుంది. నిమ్మ, నారింజల్లో కంటే 4 నుండి 10 రెట్లు విటమిన్ సి జామకాయలో అధికంగా ఉంటుంది. జామకాయ పండుతున్న కొద్దీ దానిలో విటమిన్ సి శాతం అధికమవుతూ ఉంటుంది. జామకాయలో విటమిన్ సి తోపాటు విటమిన్ ఎ, విటమిన్ బి, క్యాల్షియం, ఐరన్, పొటాషియం, ఫాస్పరస్, ఫోలిక్ యాసిడ్ వంటివి మెండుగా ఉన్నాయి. జీర్ణశక్తిని మెరుగుపరిచే ఫైబర్ కూడా జామకాయలో పుష్కలంగా ఉంటుంది. షుగర్ వ్యాధి గ్రస్తులు తినాల్సిన పండ్ల జాబితాలో జామకాయలు మొదటి వరుసలో ఉంటాయి.
షుగర్ వ్యాధి గ్రస్తులకు సంజీవనిలా జామకాయ పని చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా జామకాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. జామకాయను తినడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. తద్వారా మనం తక్కువగా ఆహారాన్ని తీసుకుంటాం. పోషకాలు ఎలాగూ జామకాయలలో పుష్కలంగా ఉన్నాయి కనుక దీనిని తినడం వల్ల మనకు నీరసం రాకుండా ఉంటుంది. ఊబకాయంతో బాధపడే వారు వారి ఆహారంలో భాగంగా రోజూ ఒక జామకాయను తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. జామకాయలో క్యాలరీలు, కొవ్వు కూడా తక్కువగా ఉంటుంది. కనుక బరువు తగ్గాలనుకునే వారికి ఇది చక్కటి ఆహారమని చెప్పవచ్చు. జామకాయను తీసుకోవడం వల్ల పలు రకాల క్యాన్సర్ ల బారిన పడకుండా ఉంటాం.
ఇందులో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ ను నివారించడంలో సహాయపడతాయి. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను తగ్గించే గుణం కూడా జామకాయలకు ఉంది. జామాకులను తినడం వల్ల దంతాల నొప్పులు తగ్గుతాయి. చిగుళ్ల వాపులు తగ్గుతాయి. జామాకులను తినడం వల్ల దంతాలు గట్టిపడతాయి. చిగుళ్ల నుండి రక్తం కారడం వంటి సమస్యలు తగ్గుతాయి. జామాకులను తినడం వల్ల ఆకలి పెరుగుతుంది. కొన్ని రకాల వ్యాధుల బారిన పడి ఆకలి మందగించిన వారికి తిరిగి ఆకలి పుట్టించే శక్తి జామాకులకు ఉంది.
ఎసిడిటీతో బాధపడే వారు రోజుకొక జామపండును తింటే మంచి ఫలితం ఉంటుంది. కడుపు ఉబ్బరం, కడుపులో మంట వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగించే గుణం కూడా జామకాయకు ఉంది. ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచడంలో జామకాయలు మనకు ఉపయోగపడతాయి. కీళ్ల నొప్పులు, వాపులతో బాధపడే వారు జామ ఆకులను వేడి చేసి నొప్పులు, వాపులపై ఉంచి కట్టు కట్టాలి. ఇలా చేయడం వల్ల కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. 5 లేదా 6 జామ ఆకులను నీటిలో వేసి మరిగించి కషాయంలా చేసుకోవాలి. ఇలా జామాకులతో చేసిన కషాయాన్ని తాగడం వల్ల దగ్గు, జలుబు తగ్గుతాయి. జామకాయల్లో విటమిన్ ఎ కూడా అధికంగా ఉంటుంది. దీనిని తినడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది.
జామకాయలను తినడం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుపడుతుంది. హార్మోన్ అసమతుల్యత వంటి సమస్యలు తగ్గుతాయి. రక్తపోటును నియంత్రించడంలో, గుండె పనితీరును మెరుగుపరచడంలో జామకాయ సమర్థవంతంగా పని చేస్తుంది. కాలిన గాయాలకు జామపండు గుజ్జును రాయడం వల్ల గాయాల నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది. ఇందులో ఉండే ఫాలిఫినాల్స్ మెదడు కణాలు చురుకుగా పని చేయడంలో సహాయపడతాయి. బాగా పండిన జామపండ్లపై నిమ్మరసం, మిరియాల పొడి చల్లుకుని తింటే మలబద్దకం తగ్గుతుంది.
చర్మ సంబంధిత సమస్యలను నయం చేయడంలో కూడా జామ మనకు దోహదపడుతుంది. మొటిమలతో బాధపడే వారు జామ ఆకులను మెత్తగా నూరి ముఖానికి లేపనంగా రాయడం వల్ల మొటిమలు తగ్గు ముఖం పడతాయి. జామపండ్లను తిన్నా లేదా జామపండ్ల జ్యూస్ ను తాగినా మనం చక్కటి ఆరోగ్యాన్ని, అందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.